"నాకు భయంలేదు. పద ! ఆ భైరవమూర్తి వ్యవహారం ఏదో తేల్చుకుంటాను" అన్నాను చాలా ధైర్యంగా.

 

    వాడు ముందు నడుస్తున్నాడు.

 

    నా బుర్ర చురుగ్గా పనిచేస్తోంది.

 

    స్కౌండ్రల్ ! వీడే ఆ హంతకుడు. ఎలాగయినా నన్ను బెదరగొట్టి వెనక్కు పంపించేయాలని చూస్తున్నాడు.

 

    వీడి మాటలు విని నా గుండెలు జారిపోతాయనుకొన్నాడు. అసలు వీడ్ని ఆ భైరవమూర్తి పంపించి ఉండడు. వీడు ఎలాగో తను ఇవ్వాళ వస్తున్నట్టు పసిగట్టాడు. టెలిగ్రాఫ్ ఆఫీసులో ఎవడో వీడికి తెలిసినవాడు ఉండిఉంటాడు. కథలల్లుతున్నాడు! కథలు ! వాడితో మంచిగానే ఉండాలి. లేకపోతే ఈ చీకట్లో వాడు ఏమైనా చెయ్యగలడు. చూట్టానికి ముసలివాడేగాని నాకంటే బలంగానే ఉన్నాడు.

 

    భూతరాజు నడుస్తున్నవాడు ఠక్కున ఆగిపోయాడు.

 

    నా ఆలోచనలకు కూడా సడన్ బ్రేక్ పడింది.

 

    "ఎందుకు ఆగావ్? పద !" అన్నాను.

 

    అప్పటికి మందంగా వెన్నెల భూమి మీదకు జారుతోంది. చెట్లూ, చెట్లకింద ఆకులూ, కాలిబాటా కనిపిస్తున్నాయి మసక మసగ్గా.

 

    భూతరాజు నిల్చుని దూరంగా చూస్తూ, చెవులు రిక్కించుకొని ఏదో వింటున్నట్టుగా నిలబడ్డాడు.

 

    "ఏమిటీ ? ఏమైంది ?"

 

    "అదుగో ! అదుగో బాబూ! మీకు విన్పించడంలేదా?" అన్నాడు తల తిప్పకుండానే శ్రద్ధగా వింటూ.

 

    "ఏమిటి? ఏం విన్పిస్తోంది?" బిత్తరపోయి అడిగాను.

 

    దూరంగా ఉన్న చెట్లకేసి చూపిస్తూ "బాగా వినండి బాబూ!"

 

    "నాకేం విన్పించటం లేదే?"

 

    "అదేంటి బాబూ అంత దీనంగా ఏడుపు విన్పిస్తుంటేనూ?"

 

    "ఏడుపా?" నా పెదవులు తడారిపోయాయి.

 

    "అవును! ఏడుపే! ఆడదాని ఏడుపు!"

 

    "ఆ...ఆడదాని ఏడుపా? నాకు విన్పించడంలేదే?"

 

    "సరిగ్గా వినండి బాబూ! అదే ఏడుపు! ఆ మహాతల్లి ఏడుపు."

 

    "ఉష్ ! భూతరాజూ! నీకేదో భ్రమకలిగింది. అంతే! లేకపోతే ఈ చీకట్లో, ఈ అరణ్యంలోకి వచ్చి ఏ ఆడది ఏడుస్తుంది? పద!" అన్నాను.

 

    వాడు మౌనంగా అలాగే నిల్చున్నాడు కొద్దిక్షణాలు.

 

    "హమ్మయ్య!" అంటూ గట్టిగా నిట్టూర్చాడు కొద్దిక్షణాలు.

 

    "హమ్మయ్య!" అంటూ గట్టిగా నిట్టూర్చాడు భూతరాజు.

 

    నేను అతడి ముఖంలో మారుతున్న భావాల్ని చూడటానికి ప్రయత్నించాను. కాని ఆ మసక వెలుగులో నాకేమీ కన్పించలేదు.

 

    "ఇప్పుడు ఆగిపోయింది. బహుశా భైరవమూర్తి ఇంటివెనక ఉన్న మర్రిచెట్టు మీదకు వెళ్ళిపోయి వుంటుంది."

 

    నాకు మతి పోయినట్టే అయింది. ఏదో భయం గుండెల్లో బయలుదేరి శరీరంలోకి, నవనాడుల్లోకి పాకుతోంది.

 

    "ఏమిటా పిచ్చిమాటలు?" నా గొంతు కీచుమంది.

 

    "పిచ్చిమాటలు కాదుబాబూ! నిజమే! ఆ మహాతల్లి ఆత్మహత్య చేసుకొంది. చనిపోయి నలభై ఏళ్ళయినా ఇంకా మోక్షం రాలేదు. ఇలా విలపిస్తూ తిరుగుతూనే ఉంది."

 

    "చచ్చిపోయి తిరగడమేమిటి?"

 

    "అదే బాబూ! కటిక చావు చచ్చింది కదా? దయ్యం అయిం..."


                                                    *    *    *    *


    "ఏమిటా రాతలు. రెండు దాటింది."

 

    శివప్రసాద్ తృళ్ళిపడ్డాడు.

 

    చేతిలోని కాలం ఎగిరి కింద పడింది.

 

    "ఏమిటలా ఎగిరిపడ్డారు?" కృష్ణవేణి ప్రసాద్ నొసటి మీద చెయ్యి వేసింది.

 

    "వళ్ళు కాలిపోతోంది రెండురోజుల్నుంచి తిండిలేదు. రాసింది చాల్లే పడుకోండి" అన్నది భార్య ప్రసాద్ తో.

 

    ప్రసాద్ బద్ధకంగాలేచి వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. వళ్ళంతా నొప్పులు. రాస్తుంటే తెలియలేదు. నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నాడు.


                                       2


    శివప్రసాద్ మంచం మీద అటూ ఇటూ కదులుతున్నాడు. ఎంత ప్రయత్నించినా నిద్రరావడంలేదు. రెండురోజులనుంచి జ్వరం. పైగా అతను రాస్తున్న నవలలోని పాత్రలు బుర్రలో అల్లరి చేస్తున్నాయి.

 

    ఏమైనా సరే ఈ నవల వీలయినంత త్వరగా ముగించాలి. కనీసం ఇదైనా ఆ పత్రిక ఎడిటర్ కి నచ్చితేనే..., లేకపోతే? శివప్రసాద్ గతంలోకి వెళ్ళి ఆలోచించసాగాడు.

 

    పాతికేళ్ళగా తను మేథను కరిగిస్తూ, శరీరంలోని ఒక్కొక్క రక్తపుబొట్టునే వెచ్చిస్తూ రచనలు చేశాడు. ఈనాడు తన రచనలు పాఠకులకు నచ్చడంలేదు. ఒకనాడు తన రచనలతో వేలకువేలు సంపాదించిన ప్రకాశకులు కూడా తనను చూడగానే ముఖం చాటేస్తున్నారు.

 

    పాపం! వాళ్ళుమాత్రం ఏం చేస్తారు ?    

 

    తనే ఈనాటి ట్రెండును అనుకరించలేకపోతున్నాడు.

 

    ఈ పాతికేళ్ళలో తను సంపాదించుకొన్నది ఏమీ లేదు. తిండికీ బట్టకూ, పిల్లల చదువులకూ, ఇబ్బంది పడకుండా గడిచింది. కాని గత ఐదేళ్ళుగా దరిద్రం తన నట్టింట్లో చేరింది.

 

    తను ఇంతకాలం ఇది రాయను అది రాయనంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. ఫలితం ఏమైంది?

 

    చిన్నకొడుకు రమేశ్ చెడు సహవాసాలు పట్టాడు. తనచేత దెబ్బలు తినలేక ఇల్లు విడిచి పారిపోయి సంవత్సరం దాటింది. వాడు అలా కావడానికి కారణం తనే. తనే

 

    తన భార్యను తను ఏం సుఖపెట్టగలిగాడు. భూదేవిలాంటి సహనశీలి. అందువల్లనే తను ఇంతవరకూ బతికున్నాడు.

 

    వయసులో ఉన్న ఆడపిల్లకు తనంటే గౌరవం లేదు. ఎలా ఉంటుంది? ఆ వయసులో ఉండే పిల్ల మనస్తత్వం తనకు తెలుసు. వాళ్ళకోరికల గురించి తను ఊహించగలడు. ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు ఎంతమంది కోరికలు తీరక పెడమార్గాలను పట్టారో తను రాశాడు. దారిద్ర్యంలో పుట్టి దారిద్ర్యంలో పెరిగి, కోరికలు తీరాక ఎంతమంది ఎలా కునారిల్లి పోతున్నారో రాశాడు.