కాలనుగుణంగా శరీర తత్వంలో కూడా మార్పు వస్తుంది.  వేసవికాలంలో ఉక్కపోత భరించలేక శరీరం మీద చెమట కాయలు, వడ గుల్లలు వంటివి వచ్చినట్టే.. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలి గాలుల కారణంగానూ,  చలి చర్మాన్ని దెబ్బ తీయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  అయితే  ఇలా పొడిబారడానికి చలి మాత్రమే ప్రధాన కారణం కాదు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..


చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇది చర్మం నుండి తేమను లాగేసుకుంటుంది.  పొడిగా కఠినంగా మారుస్తుంది.  దీని వల్లనే చాలా వరకు పొడి చర్మం సమస్య వస్తుంది. చలికాలంలో పొడిచర్మం ఉన్నవారికి సమస్య పెరుగుతుంది.


చలికాలంలో  చలికి తాలలేక చాలా మంది వేడి నీటి స్నానమే చేస్తుంటారు.  అది కూడా చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తారు.  దీని వల్ల చర్మం దెబ్బతింటుంది.  చర్మం పొడిబారుతుంది. దీనికి కారణం.. చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోవడమే.

చలికాలంలో చలి కారణంగా చాలా మంది నీరు తాగరు, పైగా చలి కారణంగా దాహం కూడా వేయదు. అందుకే శరీరంలో తేమ లోపించి చర్మం పొడిబారుతుంది. కేవలం పొడిబారడమే కాకుండా చర్మం నిర్జీవంగా మారుతుంది.


చలి నుండి ఉపశమనం కోసం ఉన్ని బట్టలు వేసుకుంటారు.  ఇవి చర్మాన్ని రుద్దుతాయి.  చర్మానికి అలెర్జీ చర్యను ప్రేరేపిస్తాయి.  దీని కారణంగా చర్మం మీద దురద, దద్దుర్లు వస్తాయి.  ఇది కూడా చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది.

 చలిని భరించలేక చాలామంది ఇళ్లలో వేడి హీటర్ లు ఏర్పాటు చేసుకుంటారు.  ఈ హీటర్ నుండి వచ్చే గాలి చర్మాన్ని సున్నితంగా మార్చి చర్మం మీద తేమను లాగేస్తుంది.  ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది.

థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ సమస్యలు ఉన్నవారి చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది.


                      *రూపశ్రీ.