దట్టమైన కనురెప్పలు కావాలా...ఇలా చేయండి..!

 

 

కవుల నుండి చిత్రాకారుల వరకు అమ్మాయిల కళ్లను ఎన్నిరకాలుగా పొగుడుతూ ఉంటారో  మాటల్లో చెప్పలేం.  కళ్లు అందంగా కనిపించడంలో కనురెప్పల పాత్ర చాలా ఉంటుంది.  కనురెప్పలు ఒత్తుగా, నల్లగా ఉంటే కళ్లు మాములు కంటే ఎక్కువ అందంగా కనిపిస్తాయి.  అయితే చాలామందికి కనురెప్పలు పలుచగా ఉంటాయి. ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో కృత్రిమ కనురెప్పలను ఉపయోగిస్తున్నారు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటాయి. అయితే అలా కాకుండా సహజంగానే కనురెప్పలు ఒత్తుగా, అందంగా పెరగాలంటే ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే..

కొబ్బరినూనె..

వెంట్రుకలు సహజంగా పొడవుగా మందంగా పెరగడంలో చాలామంది వాడేది కొబ్బరినూనెనే. ప్రతి రోజూ  రాత్రి  పడుకునే ముందు కొబ్బరినూనెను కనురెప్పలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల కనురెప్పలు కొన్ని రోజులలోనే మందంగా,  ఒత్తుగా మారతాయి.

నెయ్యి..

రోజూ కొన్ని చుక్కల నెయ్యిని ముఖానికి రాస్తుంటే చాలా మంచిదని వింటూనే ఉన్నాం. అయితే నిద్రపోయే ముందు దేశవాళీ నెయ్యిని రెండుమూడు చుక్కల మోతాదులో వేళ్లకు అద్దుకుని దాన్ని కనురెప్పల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.  ఇది కనురెప్పలను  పొడుగ్గా,  ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది.

వాసెలిన్..

కనురెప్పలు ఆకర్శణీయంగా మారాలన్నా,  ఒత్తుగా  పెరగాలన్నా వాసెలిన్ ను అప్లై చేయవచ్చు.   చలికాలంలో దీన్ని పెదవులకు కూడా అప్లై చేయడం చూస్తుంటాం. కానీ కనురెప్పలకు వాసెలిన్ అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

కొబ్బరి నూనె, విటమిన్-ఇ..

విటమిన్-ఇ క్యాప్సుల్ చర్మానికి బాగా పనిచేస్తాయి.  విటమిన్-ఇ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.    కొబ్బరినూనెలో విటమిన్-ఇ క్యాప్సూల్ వేసి బాగా మిక్స్ చేయాలి, దీన్ని రోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పల మీద అప్లై చేయాలి.  మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ నూనె..

ఆలివ్ నూనె వంటలకు, జుట్టుకు, చర్మానికి ఇలా.. చాలా రకాలుగా మేలు చేస్తుంది.  ఆలివ్ నూనెలో ఆముదం కొద్దిగా మిక్స్ చేసి ఒక కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి.  దీన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు కనురెప్పలకు అప్లై చేస్తుండాలి. కనురెప్పలు ఒత్తుగా, నల్లగా మారతాయి.

అలోవెరా జెల్..

అలోవెరా జెల్ అప్లై చేస్తే కూడా కనురెప్పలు పొడవుగా,  మందంగా పెరుగుతాయి. అలోవెరా జెల్ లో విటమిన్-ఇ క్యాప్సూల్ మిక్స్ చేసి  కనురెప్పలకు అప్లై చేసుకోవాలి.  ఇలా చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.


                                            *రూపశ్రీ.