చలికాలంలో చర్మానికి భలే ప్రొటెక్షన్.. ఇంట్లోనే బాతింగ్  పౌడర్ ఇలా..!

 


వాతావరణానికి తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మొదట చర్మమే.. ప్రతి సీజన్ లోనూ దాని పర్యావసానం చూస్తూనే ఉన్నారు ప్రజలు. వేసవి అంటే భగ్గున మండటం ఎలా ఉంటోందో.. చలికాలం అలా మొదలయ్యిందో లేదో చాలా దారుణంగా  చలి ఉంటోంది. దీని కారణంగా చర్మం చాలా తొందరగా పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంది.  పగిలిన చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే  చర్మ సంబంధ సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా చలికాలం రాగానే సోప్,  ఫేస్ వాష్ అన్నీ మార్చేస్తుంటారు.  వాటికి బదులు ఇంట్లోనే బాతింగ్ పౌడర్ తయారు చేసుకుంటే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.  ఇది నేచురల్ పౌడర్ కావడంతో ఎలాంటి సైడ్  ఎఫెక్ట్స్ ఉండవు.


బాతింగ్ పౌడర్..


కావలసిన పదార్థాలు..


శనగపిండి.. లేదా శనగపప్పు..

పెసరపప్పు..

పసుపు.. 2 స్పూన్లు

బియ్యం.. నాలుగు స్పూన్లు.

షీకాయ పొడి లేదా కుంకుడు పొడి.. రెండు స్పూన్లు.


తయారీ విధానం..

శనగపిండి  ఒక కప్పు తీసుకోవాలి.  లేదంటే ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో నాలుగు స్పూన్ల బియ్యం వేసి  ఈ మూడింటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.   పొడి అయిన పిండిలో రెండు స్పూన్ల పసుపు,  రెండు స్పూన్ల షీకాయ పొడి లేదా కుంకుడు కాయల పొడి వేసి మరొక్క సారి మిక్సీ తిప్పాలి.  ఇలా చేస్తే  అన్ని పదార్థాలు బాగా కలుస్తాయి. ఇలా మిక్సీ వేసుకున్న పిండిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి.


ఎలా వాడాలంటే..

తయారు చేసుకున్న పిండిని ఒక చిన్న కప్పులో ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోవాలి.  ఇందులో కొద్దిగా నీరు కలిపి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉన్న పేస్ట్ లాగా చేసుకోవాలి.  ఈ పేస్ట్ ను చేతిలోకి తీసుకుని తడి శరీరం మీద రుద్దుతూ సోప్ లాగే రాసుకోవాలి.  ఈ పిండిలో కాస్త రవ్వలాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది.  సాధారణ చర్మం ఉన్నవారికి ఇది చక్కగా పనిచేస్తుంది.  సున్నితమైన చర్మం ఉన్నవారు ఇందులో నీటికి బదులు పాలు కలిపి పేస్ట్ చేసుకోవచ్చు.  

చర్మ సంబంధ సమస్యలు పోవాలన్నాచర్మం సహజంగా నిగారింపు రావాలన్నా కూడా ఈ పొడి చక్కగా పనిచేస్తుంది.  కనీసం వారానికి ఒకసారి శరీరానికి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె రాసుకుని గంట ఆగిన తరువాత ఈ పొడితో స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది.  చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి.  ఈ పొడిలోకి కాస్త పాలు,  కొంచెం తేనె వేసి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.  అయితే ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఇందులో షీకాయను మినహాయించడం మంచిది.


                                        *రూపశ్రీ.