Read more!

తీపి దగ్గర తడబడుతున్నారా?

తీపి దగ్గర తడబడుతున్నారా?

అమ్మాయిలకు స్వీట్స్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఇంకా తీపి పదార్థాలు అంటే చెప్పలేనంత ఇష్టం. మరీ ముఖ్యంగా బయటకు ఎక్కడికైనా వెళితే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుక చేసుకుంటే తీపి పదార్థాల వల్ల కలిగే ఇబ్బందుల గురించి మనసులో ఒకవైపు భయం ఉన్నా వాటిని వదల్లేక తినేస్తుంటారు.  అయితే ఇలా తీపి పదార్థాలను తినడం అనేది సాధారణమైన అలవాటు కాదని. దీని వెనుక కారణం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

తీపి పదార్థాలు తినాలని అనిపించడం వెనుక కారణం అనే మాట వినగానే చాలామంది షాక్ కు గురవుతారు కచ్చితంగా. అయితే దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమి లేదు. తీపి పదార్థాలు తినాలని అనిపించడానికి గల కారణాలు తెలుసుకుంటే తీపి వల్ల కలిగే అన్ని రకాల సమస్యలనూ పరిష్కరించుకోవచ్చు.

తీపి తినాలని అనిపించడానికి కారణాలు!!

ఒత్తిడికి లోనవడం తీపి తినడానికి కారణం అవుతుంది అనే మాట ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ ఇది నిజమని తెలిసింది. ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగానే శరీరానికి నిస్సత్తువ ఆవరించినట్టు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తెలియకుండానే ఏదైనా తీపి తినాలని అనిపిస్తుంది. అలా అనిపించగానే మహిళలు ఇంట్లోనూ, బయట పనిచేసేచోటా తీపి కోసం చాక్లెట్ ల మీదా బయట అమ్మే తీపి పదార్థాల మీద ఆధారపడతారు.

చాలామంది మహిళలను వేధించే సమస్యలలో నిద్రలేమి ముఖ్యమైనది. నిద్రలేమి ఉన్నవారికి శరీరంలో కలిగే హార్మోన్స్ ప్రభావం వలన తీపి తినాలని అనిపిస్తుంది.

అలసట అనేది మనిషిలో అంతర్లీనంగా భాగమైపోయి కనిపించే సమస్య. చాలామంది అలసటను గురైనప్పుడు చాక్లెట్ నోట్లో వేసుకోగానే ఎనర్జీ వచ్చినట్టు ఫీలవతారు. ఆ కారణంతో చాక్లెట్ లకు స్వీట్ లకు అలవాటు పడితే వాటికి ఆడిక్ట్ అయిపోతారు.

శారీరక శ్రమ లేనివాళ్ళలో స్వీట్లంటే ఎక్కువ ఇష్టం ఉంటుందట. శరీరంలో ఏర్పడ్డ మార్పులు దీనికి కారణమవుతాయి. శారీరక శ్రమ లేనప్పుడు సహజంగానే మనుషులు మహా బద్ధకంగా కనిపిస్తుంటారు. వారికి స్వీట్లు, చాక్లెట్లు అంటే చెప్పలేని మక్కువ ఏర్పడుతుంది.

శరీరంలో తగినంత నీతి శాతం లేకపోయినప్పుడు కూడా తీపి మీదకు మనసు మల్లుతుందట. బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు తీపి తినాలని అనిపించినా సందర్భాలు గుర్తుచేసుకుంటే ఇది నిజమేనని అనిపిస్తుంది. నోరు తడి ఆరిపోవడం తీపి తినాలని అనిపించడం గమనించవచ్చు.

ఈ సమస్యకు చెక్ పెట్టాలి ఇలా….

తీపి తినాలని అనిపించినప్పుడు ఎక్కువ చెక్కెరలు కలిగిన పదార్థాలను టచ్ చేయకూడదు. తీపిని కంట్రోల్ లో పెట్టాలంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి.

తీపి తినాలని అనిపించినప్పుడు చాక్లెట్ లు తినడం చాలామంది అలవాటు.  డార్క్ చాక్లెట్ లు పెద్ద పెద్దవి కొనుక్కుని లాగిస్తారు. అలా చేస్తే చాలా మొత్తంలో కేలరీలు పొట్టలోకి చాలా సులువుగా వెళ్లిపోతాయి. పైపెచ్చు అంత పెద్ద చాక్లెట్ లు ప్రతిసారి కొనడం అంటే కష్టమే. అందుకే చిన్న చిన్న చాక్లెట్  లేదా పెద్ద చాక్లెట్ లో చిన్న ముక్కలు ఒక రెండు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కాసింత ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది.

తీపి అంటే స్వీట్లు, చాక్లెట్లు మాత్రమే కాదు. తీపిని ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి. చిలగడ దుంప, స్వీట్ కార్న్ మొదలైన వాటిలో తీపిదనం బానే ఉంది. కాబట్టి తీపి తినాలని అనిపించినప్పుడు వాటిని తీసుకోవచ్చు.

తీపికి కేరాఫ్ అడ్రస్ గా డ్రై ఫ్రూట్స్ ని పేర్కొనవచ్చు. కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ మొదలైన ఎండు ఫలాలలో తీపిదనం ఎక్కువ కాబట్టి తీసుకోవచ్చు.

అన్నిటికంటే ఉత్తమమైనవి ఆరోగ్యమైనవి సహజమైన పండ్లు. అరటి, బొప్పాయి, దానిమ్మ, ఆరెంజ్, సపోటా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండు తీపిదనాన్ని నింపుకున్నదే. కాబట్టి తీపి కోసం మనసు కొట్టుకుంటున్నప్పుడు హాయిగా పండ్లను తీసుకోవచ్చు.

తీపికి మరొక ఆప్షన్ తేనె, బెల్లం. తీపి తినాలని అనిపించినప్పుడు టీ స్పూన్ తేనె లేదా ఓ ముక్క బెల్లం నోట్లో వేసుకుంటే మంచిది.

అమ్మో తీపి తినాలని అనిపిస్తుంది. తింటే లావైపోతాం. అనే సందేహాలు పెట్టుకోకుండా పైన చెప్పుకున్న ప్రత్యామ్నాయాలు ఫాలో అయితే సమస్యే ఉండదు.

                                    ◆నిశ్శబ్ద.