గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం?
posted on Dec 29, 2022
గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం?
గర్భవతులు చాలా సున్నితంగా ఉంటారు. అయితే గర్భవతులు దృఢంగా ఉండాట్సన్ ఎంతో అవసరమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. గర్భవతులు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుందనేది గైనకాలజిస్ట్ లు చెప్పే మాట. అయితే గర్భవతులు, వ్యాయామం అనే మాట వినగానే గయ్యిమని అరిచే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. కానీ వ్యాయామం అనేది గర్భవతులకు చాలా ముఖ్యం.
ప్రసవానికి ముందు కాలములో వ్యాయామము చేయడం వల్ల గర్భవతులలో భయాందోళనలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. తెలియని విషయానికి భయపడటం సాధారణంగా అందరి విషయంలో జరిగేదే.. దీనికి చిన్న పిల్లల నుండి గర్భవతులు, మహిళలు, వృద్ధులు, పురుషులు ఇలా ఎవరూ మినహాయింపు కాదు. అయితే గర్భవతులలో భయం కలిగినప్పుడు సాధారణంగానే ఆందోళన కలుగుతుంది. ఈ ఆందోళన కాస్తా.. తలనొప్పికి దారితీస్తుంది. అలాంటి సమయంలో ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా ఉండలేరు. మనసులో ఏ మూలో ఎంతో కొంత భయం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. అలాంటి సమయాల్లోనే లేని అనుమానాలు పుడుతూ ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్న భయానికి అవి తోడయ్యి గోరంత సమస్యను కొండంత చేస్తాయి.
వ్యాయామము చేస్తే గర్భవతులలో ఉన్న ఈ ఆందోళన తగ్గిపోతుంది. వ్యాయామం వల్ల శరీరం విశ్రాంతిని బాగా కోరుకుంటుంది. దీని ఫలితంగా ఎలాంటి గందరగోళం లేకుండా హాయిగా నిద్రపోతారు. ఇక ప్రసవానికి ముందు మహిళలు వ్యాయామం చేస్తుందం ద్వారా మరొక అద్భుత ప్రయోజనం ఉంటుంది. అదే గర్భవతిలో కండరాలను దృఢంగా చేయడం. ప్రసవం సమయంలో గర్భవతులలో కండరాల సంకోచం వ్యాకోచాలు అధికంగా జరుగుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల కారణంగా కండరాలు మరింత బలహీనం అవుతాయి. అదే వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా మారితే ప్రసవ సమయంలో నొప్పులను భరించడం సాధ్యమవుతుంది.
అకాలపు ప్రసవాలు, ప్రసవ సమయంలో ప్రమాదాలు, సాధారణ ప్రసవాన్ని భరించలేక సిజేరియన్ వైపు మొగ్గు చూపడం వంటి వాటిని గర్భవతులు వ్యాయామం ద్వారా దూరం ఉంచవచ్చు.
గర్భాశయము అంటే బోలుగా ఉండే ఒక కండరము. ఈ కండరము ప్రపన సమయములో శిశువును బయటికి నెట్టడానికి సహకరిస్తుంది. ఈ కండరము గర్భాశయ ద్వారము దగ్గర ఉండి ఇతర కండరాల ఒత్తిడిని ప్రతిఘటించి కడుపులో బిడ్డను బయటకు నెట్టేందుకు సహకరిస్తుంది. వ్యాయామం వల్ల ఈ కండరం దృఢంగా మారుతుంది.
ఒక వైపు నొప్పులు మరో వైపు భయము చేరి ప్రసవ సమయములో కండరములు సరిగా పని చేయకుండా అవరోధము కలిగిస్తుంటాయి. అందుకే గర్భవతులు వ్యాయామము చేస్తూ, ప్రసవానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉంటే గర్భవతులకు ప్రవేశం సమయంలో ఆందోళన ఏర్పడకుండా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి గర్భవతులకు వ్యాయామం ఎంతో ముఖ్యం. అయితే నిపుణులను అడిగి వారి నెలలను బట్టి వ్యాయామాలను తెలుసుకుని చేయాలి.
◆నిశ్శబ్ద.