English | Telugu

య‌ష్ ఎంట్రీ.. స్టేష‌న్ లో వేద.. ఏంజ‌రిగింది?


బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్న‌ రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ గా దీన్ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. స్టార్ ప్ల‌స్ లో ప్ర‌సార‌మై సూప‌ర్ హిట్ గా నిలిచిన `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

కైలాష్ గురించి అత్త మాలినికి చెప్పినా ఫ‌లితం లేక‌పోగా తిరిగి త‌న‌నే అనుమానిస్తూ అవ‌మానిస్తుండ‌టంతో ఈ విష‌యాన్ని త‌న అక్క‌కు చెప్పాల‌నుకుంటుంది వేద. వేంట‌నే త‌న‌ని క్లినిక్ కి రమ్మ‌ని ఫోన్ చేస్తుంది. అయితే నేరుగా త‌న గురించి అని కాకుండా త‌న ఫ్రెండ్ కు ఇలా జ‌రుగుతోంద‌ని చెబుతుంది. ఇలాంటి విష‌యాల్ని నాన్చ‌డం వ‌ల్ల మ‌న ఆడ‌వాళ్లు జీవితాల్ని కోల్పోతున్నార‌ని, అదే నేనైతే అడ్డంగా న‌రేకేస్తాన‌ని వేద అక్క చెబుతుంది. "నీ ఫ్రెండ్‌కి ధైర్యం లేక‌పోతే నేను వ‌స్తా వాడి అంతు చూడ‌టానికి" అని చెబుతుంది. దీంతో అక్క‌ర్లేద‌ని, తానే ఈ విష‌యాన్ని చెబుతానంటుంది వేద‌.

ఇదంతా బ‌య‌ట చాటుగా వింటున్న వేద అసిస్టెంట్... వేద సోద‌రి వెళ్లిపోగానే లోపలికి వ‌చ్చేస్తుంది.. మీరు చెప్పింది మీ ఫ్రెండ్ గురించి కాద‌ని, మీ గురించేన‌ని, మిమ్మ‌ల్ని వేధిస్తుంది మీ ఇంట్లో వున్న కైలాష్ అని చెప్ప‌డంతో వేద ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. కైలాష్ నీచుడ‌ని, త‌న‌ని కూడా మోసం చేశాడ‌ని, వాడికి ఎలాగైనా మీరే బుద్ధి చెప్పాలంటుంది. అయితే త‌న‌కు స‌పోర్ట్ గా వుండాలంటుంది వేద‌.

క‌ట్ చేస్తే .. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో వేద‌పై దాడికి కైలాష్ సిద్ధ‌ప‌డ‌తాడు.. అదే టైమ్ లో ముంబై ట్రిప్ ముగించుకుని య‌ష్ ఇంటికి వ‌స్తాడు.. మిర్ర‌ర్ పై వేద `ఐ మిస్ యూ` అని రాసి పెట్టడాన్ని చూసి ఫీల‌వుతాడు.. అయితే ఇంట్లో వేద క‌నిపించ‌దు.. కంగారు ప‌డిన య‌ష్.. స్టేష‌న్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు.. ఇంత‌కీ మిస్స‌యింది ఎవ‌ర‌ని ఎస్సై అడిగితే య‌ష్ ఫోన్ లో వేద ఫొటో చూపిస్తాడు. క‌ట్ చేస్తే పోలీస్ స్టేష‌న్‌ సెల్ లో వేద‌ని చూసి య‌ష్ షాక్ అవుతాడు.. ఇంత‌కీ ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.