English | Telugu

సీనియర్ యాక్టర్ కౌశిక్ : తెలుగోడికి శాపంగా తెలుగు టీవీ ఇండస్ట్రీ



బిగ్ బాస్ సీజన్-8 లో కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ గెలవడంతో తెలుగు-కన్నడ ఆర్టిస్ట్ ల మధ్య వివాదం రేగింది. దాని తర్వాత టీవీ ఆర్టిస్ట్ లు ఒక్కొక్కరిగా తెలుగు ఆర్టిస్ట్ లకు జరుగుతున్న అన్యాయాలని బయటపెటుడుతున్నారు. సీనియర్ యాక్టర్ కౌశిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారి భాదలని చెప్పుకొచ్చాడు.

యాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. ఒక తెలుగు సీరియల్ ప్రారంభం అవుతుంటే అందులో 10 మంది ఆర్టిస్ట్‌లు కావాల్సి వస్తే.. అందులో ఏడుగుర్ని తెలుగు వాళ్లని తీసుకోండి. ముగ్గురు పరాయి భాష వాళ్లని తీసుకోండి. హీరోని తెచ్చుకుంటా? హీరోయిన్‌ని తెచ్చుకుంటారా? అన్నది మీ ఇష్టం. అంతా పరాయి భాష వాళ్లనే పెట్టడం వల్ల వాళ్లకి భాష రాదు. భాషలో భావం తెలియదు. భాష, భావం తెలియనప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఎలా వస్తుంది? లొకేషన్‌లో పరాయి భాష వాళ్లని తీసుకొచ్చి పెట్టడం వల్ల.. వాళ్లు చాలా టేక్‌లు తీసుకుంటారు. అది వాళ్ల తప్పు కూడా కాదు. వాళ్లకి భాష రాదు.. మళ్లీ వాళ్లకి వచ్చిన భాషలో సీన్‌ని వివరించాలి. అర్థం చెప్పాలి.. ప్రామిటింగ్‌లో లిప్ సింక్ కరెక్ట్‌గా మ్యాచ్ కావాలి. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. దీని వల్ల నిర్మాతకి నష్టం జరుగుతుంది. రోజుకి ఐదారు సీన్లు కావాల్సింది.. రెండు మూడు సీన్లే అవుతుంది. అయినా సరే వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.

నేను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. నాకు 45 ఏళ్లు. ఇప్పుడు నేను కొత్తగా ఉద్యోగం ఏమీ చేయలేను కదా. నా బతుకు ఇదే. నాలాంటి వాళ్లు తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది ఉన్నారు. తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో 900 మంది వరకూ మెంబర్స్ ఉన్నారు. వాళ్లలో 150 మందికి మాత్రమే పని ఉంది. మిగిలిన వాళ్లంతా ఖాళీగా ఉన్నారు. ఈ మాట నేను చాలా బాధగా చెప్తున్నా. అసోషియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు.. కరెక్టే కానీ.. అసోషియేషన్ అంటే వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగని ఖాళీగా ఉన్న వాళ్లు తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వమని ముందుకొచ్చి నిలబడే పరిస్థితి లేదు. ఎవడికి కావాలంటే వాడు ముందుకెళ్లండి అంటున్నారు. అలాగైతే తెలుగు వాళ్లకి అవకాశాలు ఎలా వస్తాయి. నా వరకు నాకు వేషాలు వస్తున్నాయి. బాగానే సంపాదించుకున్నా.. హ్యాపీగానే ఉన్నా. నాకొచ్చిన నష్టం ఏం లేదు. నాకెందుకు ఇంత తాపత్రయం ఎందుకంటే.. నేను ఇలా ఉన్నానంటే టీవీ సీరియల్స్ వల్లే. నాకు ఇంత ఇచ్చిన టీవీ ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి చేయాలి.. తెలుగు ఆర్టిస్ట్‌లకు న్యాయం జరగాలనే నా పోరాటం. ఈరోజు తెలుగు వాళ్లకి అవకాశాలు రావడం లేదనేది నిజమంటూ టీవీ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ల గోడుని వ్యక్తపరిచాడు సీనియర్ టీవీ ఆర్టిస్ట్ కౌశిక్.