English | Telugu

అది యాధృశ్ఛికమే తప్ప.. కావాలని ఏ సీన్‌ కాపీ చెయ్యలేదు!

ఒకప్పుడు సోసల్‌ మీడియా అనేది లేదు. దాంతో సినిమాలకు సంబంధించి మనకు తెలియని విషయాలు తెలీకుండానే ఉండేవి. ఎవరూ వాటిని బయటకు తెచ్చే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ, ఇప్పుడలా కాదు, ఒక సినిమా రిలీజ్‌ అయిందంటే ఆ సినిమా దేనికి ఇన్‌స్పిరేషన్‌గా చేశారు, లేదా దేనికి కాపీ అనేది క్షణాల్లో చెప్పేంత పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా తెలుగు రచయితలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వుంటారు. రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న వక్కంతం వంశీ రాసిన కథల్లో కొన్నింటికి ఫలానా సినిమాతో పోలిక ఉంది, ఆ సీన్‌ మరో సినిమాలో కూడా ఉంది అనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు.

అలాంటి వాటి గురించి ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలకు కథలు అందించిన వంశీ దర్శకుడిగా కూడా సక్సెస్‌ సాధించాలన్న పట్టుదలతో అల్లు అర్జున్‌తో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమాను డైరెక్ట్‌ చేశారు. కానీ, అది డిజాస్టర్‌ అయింది. దాంతో ఆ ప్రయత్నం మానుకొని మళ్లీ రచయితగా తన జర్నీ కొనసాగించారు. రీసెంట్‌గా నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే ఎంటర్‌టైనర్‌తో మళ్లీ దర్శకుడిగా ఓ ప్రయత్నం చేశారు. ఇది కూడా డిజాస్టర్‌ అయ్యింది. అయితే ఆయన రచయితగా సక్సెస్‌ అయినంతగా దర్శకుడిగా సక్సెస్‌ అవ్వలేకపోతున్నారన్న విషయం మనకు అర్థమవుతోంది.

రచయితగా తన జర్నీ ఎలా స్టార్ట్‌ అయిందీ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే విషయాల గురించి మాట్లాడుతూ ‘‘కిక్‌’ సినిమాకి ముందు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు ఆ ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నా పెళ్లి సమయంలోనే కిక్‌ సినిమా విడుదలైంది. ఆర్థికంగా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే ధైర్యాన్ని ఇచ్చిందా సినిమా. అప్పటి నుంచి మన హీరోలకు డిఫరెంట్‌ కథలను రెడీ చేసుకుంటూ వెళుతున్నాను. అయితే అప్పుడప్పుడు ఇది ఫలానా సినిమాలోని సీన్‌ కదా అని పాయింట్‌ అవుట్‌ చేస్తుంటారు. నేను చెప్పేది ఏమిటంటే ప్రపంచంలో లేని దాని గురించి ఎవ్వరూ ఊహించలేరు. అలాగే ఉన్న దానిని తీసుకొని దాన్ని కొత్త చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తాం. ఏదైనా అలాంటి సీన్‌ ఉంది అనిపిస్తే అది యాధృశ్చికంగా వచ్చిందే తప్ప కావాలని ఏ సినిమాలో సీన్‌ నేను తీసుకోలేదు. ప్రపంచంలో కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎక్కడో ఒకచోట నేను క్రియేట్‌ చేసిన పాత్రలు, సీన్స్‌ వాటిని పోలి ఉండవచ్చు’ అన్నారు.