English | Telugu
అప్పుడు అల్లరి నరేష్.. ఇప్పుడు సంగీత్ శోభన్
Updated : Oct 6, 2023
ఓ వైపు అన్న హీరోగా నిలదొక్కుకోవడానికి తెగ కష్టపడుతుంటే, మరోవైపు తమ్ముడు కామెడీ హీరోగా ఒక్కసారిగా క్లిక్ అయితే ఎలా ఉంటుంది. అప్పట్లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ విషయంలో అలాగే జరిగింది. 'హాయ్' సినిమాతో హీరోగా పరిచయమైన ఆర్యన్ రాజేష్.. పలు సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మరోవైపు 'అల్లరి'తో పరిచయమైన నరేష్ మాత్రం.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని తక్కువ కాలంలోనే 50కి పైగా సినిమాల్లో నటించి ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో ఇద్దరు బ్రదర్స్ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.
దర్శకుడు శోభన్ పెద్ద కుమారుడు సంతోష్ శోభన్.. 'పేపర్ బాయ్', 'ఏక్ మినీ కథ', 'మంచి రోజులొచ్చాయి', 'అన్నీ మంచి శకునములే' వంటి సినిమాలతో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనికి సరైన బ్రేక్ రావడం లేదు. కానీ తమ్ముడు సంగీత్ శోభన్ మాత్రం సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. సంగీత్ హీరోగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ నేడు(అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో నార్నే నితిన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటించినప్పటికీ.. సంగీత్ కి అందరి కంటే ఎక్కువ పేరు వచ్చింది. అతని కామెడీకి అందరూ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ కి ఓ మంచి కామెడీ హీరో దొరికాడని అంటున్నారు. మరి సంగీత్.. అల్లరి నరేష్ స్థాయికి ఎదుగుతాడేమో చూడాలి.