English | Telugu
ఎందుకింత విష ప్రచారం!
Updated : Oct 25, 2023
ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ మరే ఇతర సీనియర్ స్టార్స్ లేనంత పీక్ ఫామ్ లో ఉన్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. ఇటీవల విడుదలైన 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ అందుకున్నారు. దసరాకి విడుదలైన సినిమాలలో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'భగవంత్ కేసరి'.. రోజురోజుకి వసూళ్ళు పెంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని, దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. నందమూరి అభిమానుల మధ్య కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నందమూరి కుటుంబానికి రాజకీయాలతో విడదీయరాని అనుబంధం ఉంది. పైగా బాలకృష్ణ ప్రత్యక్ష రాజాకీయాల్లో ఉన్నారు. హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మరి కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థి పార్టీ నేతలు.. తమ చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తూ.. బాలయ్య, తారక్ అభిమానుల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన 'భగవంత్ కేసరి' మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.32 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే బాలకృష్ణ గత చిత్రం 'వీరసింహారెడ్డి' మొదటి రోజు రూ.50 కోట్ల గ్రాస్ రాబడితే.. 'భగవంత్ కేసరి' మాత్రం ఆ సినిమాతో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ రాబట్టడంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనంగా ఉండటంపై స్పందించిన బాలకృష్ణ 'ఐ డోంట్ కేర్' అన్నారు. దీంతో హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమానులు 'డోంట్ కేర్' అంటూ బాలయ్య సినిమాని పట్టించుకోవడం మానేశారని, అందుకే భారీ ఓపెనింగ్స్ రాలేదని రాసుకొస్తున్నారు. నిజానికి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ డోంట్ కేర్ అనలేదు. సినీ పరిశ్రమలో ఎవరు స్పందించకపోయినా డోంట్ కేర్ అనే ఉద్దేశంతో అన్నారు. పైగా 'డోంట్ కేర్' అనేది 'భగవంత్ కేసరి' చిత్రంలోని డైలాగ్. ఆ డైలాగ్ నే ఆయన చెప్పారు.
ఇక 'వీరసింహారెడ్డి'తో పోలిస్తే 'భగవంత్ కేసరి' ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. వీరసింహారెడ్డి సంక్రాంతి పండుగకి విడుదలైంది. సోలోగా రిలీజ్ కావడంతో మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో ప్రదర్శితమైంది. అసలే సంక్రాంతి సీజన్, పైగా ఫస్ట్ డే పోటీ లేదు.. దానికి తోడు 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. 'భగవంత్ కేసరి' విషయంలో దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన రోజే తెలుగునాట 'లియో' కూడా భారీస్థాయిలో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సినిమా కావడంతో తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో.. నందమూరి, నారా అభిమానులు కాస్త బాధలో ఉండి మొదటిరోజు ఎప్పుడూ బాలయ్య సినిమాకి చేసే అంత హడావుడి 'భగవంత్ కేసరి'కి చేయలేదు. అయినప్పటికీ 'అఖండ' స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన 'భగవంత్ కేసరి'.. రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఫుల్ రన్ లో 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలను మించిన కలెక్షన్స్ రాబట్టేలా ఉంది.