English | Telugu
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ సినిమాని పట్టించుకోవడం లేదేంటి!
Updated : Nov 13, 2023
టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు రీరిలీజ్ లో మంచి వసూళ్లతో సత్తా చాటాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం హిట్ మూవీ 'సింహాద్రి'.. రీరిలీజ్ లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. త్వరలో ఎన్టీఆర్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా పట్ల ఎందుకో ఆయన అభిమానులు అంతగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు.
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అదుర్స్'. 2010 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. భట్టు(బ్రహ్మానందం)తో కలిసి చారిగా ఎన్టీఆర్ పంచిన వినోదానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 13 ఏళ్ళ తర్వాత ఈ నవంబర్ 18న అదుర్స్ ని రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ఈ బుకింగ్స్ కి 'సింహాద్రి' స్థాయి రెస్పాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సింహాద్రి అనేది పక్కా మాస్ సినిమా. పైగా అప్పుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే ఆ రీరిలీజ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, థియేటర్లకు క్యూ కట్టారు. చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ పడ్డాయి. అయితే ఇప్పుడు అదుర్స్ పరిస్థితి వేరు. ఇది పూర్తి మాస్ సినిమా కాదు. అప్పుడు ఫ్యాన్స్ కంటే కూడా సాధారణ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెగ్యులర్ గా ఎంజాయ్ చేసే మాస్ మూమెంట్స్ ఈ సినిమాలో తక్కువ. అందుకే రీరిలీజ్ బుకింగ్స్ ఓపెన్ కాగానే టికెట్స్ కోసం ఎగబడట్లేదేమో అనిపిస్తోంది.