English | Telugu
వైసిపి, జనసేన వార్.. మధ్యలోకి అనసూయ ఎందుకు వెళ్లినట్టు?
Updated : Oct 24, 2023
ఒక వేడుకకి సినిమా సెలబ్రిటీస్ వస్తున్నారంటే జనం స్పందన మామూలుగా ఉండదు. వారిని చూసేందుకు వేలాదిగా జనం చుట్టు పక్కల ఊళ్ళ నుంచి కూడా రావడం మనం చూస్తుంటాం. మరి పవన్‌కల్యాణ్ వంటి క్రేజీ హీరో, స్టార్ హీరో తమ ఊరికి వస్తున్నాడంటే వారి ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమ అభిమాన హీరోని చూసేందుకు ప్రజలు, అభిమానులు వేలల్లో రావడం సహజమే. కృష్ణా జిల్లా పోరంకిలో పవర్‌స్టార్ అభిమానులు చేసిన సందడే దీనికి నిదర్శనం. వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సమయంలో వారిని కంట్రోల్ చెయ్యడం ఎవ్వరి వల్లా కాలేదు. అప్పుడు జరిగిన తోపులాటలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీ జనాన్ని తప్పించుకొని బయటికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రస్తావిస్తూ జనసేన ఫ్యాన్స్, పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తుండగా, మరో వ్యక్తి ఈ ఘటనకు స్పందిస్తూ.. ‘అనసూయ, రష్మీ ఇక్కడికి వచ్చినా జనం ఇలాగే ఎగబడతారు’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నటి, యాంకర్ అనసూయ ఘాటుగా స్పందించారు. ఆ వేడుకలో తమ పేర్లు ప్రస్తావించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అనసూయ ‘‘ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాను. నా ప్రయాణాన్ని తక్కువ చేసి చూడకుండా గౌరవిస్తే బాగుంటుంది. ఈ విషయంలో మా పేర్లు ఉపయోగించడం తప్పు. జీవితంలో ఏదో సాధించిన వారు ఎలా ఉంటారో చూద్దామనే జనం వస్తారు. మా పేర్లు వాడినంత మాత్రాన ఎవరూ సులువుగా ఈ స్థాయికి రాలేరు. ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిది’’ అంటూ సమాధానం చెప్పింది.
అసలు జరిగింది ఇదీ..
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఇటీవల కృష్ణా జిల్లా పోరంకిలో జరిగింది. ఈ వివాహానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తమ అభిమాన నాయకుడు కనిపించేసరికి అతనితో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ ఎంతో కష్టం మీద అతన్ని బయటికి తీసుకొచ్చేశారు. ఈ తోపులాటలో కొడాలి నాని, వల్లభనేని వంశీ చిక్కుకుపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ, రష్మీ పేర్లను కూడా వారు ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో ఇది పెద్ద వార్‌గా మారింది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ చేస్తున్నారు.