English | Telugu
ఎన్టీఆర్ అభిమాని కోసం ఏకమైన అందరు హీరోల అభిమానులు!
Updated : Jun 26, 2023
ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి అందరు హీరోల అభిమానులను ఏకం చేసింది. శ్యామ్ అనే ఎన్టీఆర్ అనే అభిమాని మరణం పట్ల అతనికి, అతని కుటుంబానికి న్యాయం జరగాలంటూ అభిమానులంతా ఏకమై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 23 ఏళ్ల శ్యామ్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమా విడుదలైనా, ఈవెంట్ జరిగినా హంగామా చేసే శ్యామ్ ఎందరికో సుపరిచితం. అయితే ఉన్నట్టుండి అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ బాధ పెట్టింది. మొదట అందరూ ఆత్మహత్యగానే భావించారు. కానీ అది ఆత్మహత్య కాదని, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానం రావడంతో అభిమానులు పోరాటానికి దిగారు. #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారంలో శ్యామ్ ని హత్య చేసి, రాజకీయ అండదండలతో దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. జాబ్ లేదని శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండటాన్ని వారు ఖండిస్తున్నారు. జాబ్ గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని, అలాంటప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని నిలదీస్తున్నారు. అతని మెడ మీద ఉరి వేసుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవని, పైగా అతని ఒంటిమీద తీవ్ర గాయాలు ఉన్నాయని.. అలాంటప్పుడు దీనిని ఆత్మహత్య అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోరాడటానికి శ్యామ్ కుటుంబసభ్యులు భయపడుతున్నారని, సినీ రాజకీయ ప్రముఖులు వారికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ హీరోల అభిమానులతో పాటు ఇతర భాషలకు చెందిన హీరోల అభిమానులు కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు.