English | Telugu
ఈ వారం పై చేయి ఎవరిది!
Updated : Feb 15, 2023
సంక్రాంతి సందడి ముగిసింది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి సంక్రాంతి విజేతగా నిలిచారు. బాలయ్య సైతం వీరసింహారెడ్డి తో మెప్పించారు. ఇక ఆ తర్వాత తెలుగులో వచ్చిన చిత్రాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సంక్రాంతి సందడి తర్వాత వచ్చిన ఒక్క చిత్రం కూడా సరైన హిట్ని సాధించలేదు. చాలామంది బింబిసారా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ చిత్రం పై నమ్మకం పెట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం ఇందులో ఒకే పోలికలో ఉండే ముగ్గురు కళ్యాణ్ రాములు కనిపిస్తూ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద కళ్యాణ్ రామ్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురయింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
ఇక ఈ వారం కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ చిత్రం విడుదలవుతోంది. దీనికి తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఈ మూవీకి ముందు తీసిన మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలు సరిగా ఆడలేదు. మొదటి చిత్రం తొలిప్రేమ మాత్రం బాగా ఆడింది. మరి ఈ దర్శకుడికి ఇప్పుడు విజయం చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సార్ చిత్రంతో మెప్పిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
దీంతోపాటు గీత ఆర్ట్స్ బ్యానర్ 2లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సార్ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. వినరో భాగ్యము విష్ణు కథ కాన్సెప్ట్ యూత్ ఆడియన్స్ కు నచ్చేలా ఉంది కనుక ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి మాత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేయకుండా పోతుందా అనే ఆశతో సినీ ప్రేక్షకులు అటు నిర్మాతలు ట్రేడ్ వర్గాలు విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.