English | Telugu

ప్రముఖ విలన్ రామిరెడ్డి కన్నుమూత

ప్రముఖ విలన్ రామిరెడ్డి కన్నుమూత తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు అన్నారు. విషయంలోకి వెళితే 1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో, డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం "అంకుశం" ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి విలన్ గా ప్రవేశించిన రామిరెడ్డి అనంతరం 250 చిత్రాలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించారు.

 

తెలుగులో గాయం, ఒసేయ్ రాములమ్మ, అనగనగా ఒక రోజు, అమ్మోరు వంటి చిత్రాలు ఆయనకు విలన్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. "అంకుశం" చిత్రంలో "స్పాట్ పెడతా" అనేది ఆయన ఫేమస్ డైలాగ్. రామిరెడ్డి గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఏప్రెల్ 14 వ తేదీన కన్నుమూశారు.

 

రామిరెడ్డికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృత దేహాన్ని హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన గృహానికి తరలించారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 52 సంవత్సరాలు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగువన్ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది.