English | Telugu
అంత బాధలోనూ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ ఆంటోనీ!
Updated : Sep 29, 2023
కుటుంబంలో విషాదం చోటుచేసుకున్నా, మనసులో ఎంత బాధ ఉన్నా దానిని అధిగమించి తమ వృత్తి పట్ల నిబద్ధత చాటుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే సినీ హీరో విజయ్ ఆంటోనీ. కూతుర్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా.. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో మూవీ ప్రమోషన్స్ పాల్గొంటున్నాడు.
విజయ్ పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో విజయ్ ఎంతో కృంగిపోయాడు. తన కూతురితో పాటే తానూ చనిపోయానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అయితే అంత బాధలో ఉన్నప్పటికీ విజయ్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
విజయ్ హీరోగా సీ.ఎస్. ఆముదన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రథం'. ఈ మూవీ అక్టోబర్ 6న విడుదల కానుంది. విజయ్ కుటుంబంలో జరిగిన విషాదంతో సినిమా విడుదలను వాయిదా వేయడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. అయితే వాయిదా వేస్తే నిర్మాతలు నష్టపోతారని భావించిన విజయ్.. చెప్పిన తేదీకే విడుదల చేయమని సూచించాడు. అంతేకాదు తన బాధ్యతగా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు. కూతురు మరణించిన పది రోజుల లోపే విజయ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో.. సినిమా పట్ల, వృత్తి పట్ల అతనికున్న ప్రేమని, నిబద్ధతని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.