English | Telugu
'వకీల్ సాబ్' సీక్వెల్ వచ్చేస్తోంది!
Updated : Apr 10, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'వకీల్ సాబ్' సినిమాపై ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల కోసం సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్.. 'వకీల్ సాబ్'తోనే రీఎంట్రీ ఇచ్చారు. హిందీ ఫిల్మ్ 'పింక్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేవ్యూ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా నిర్మించగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. 2021, ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'వకీల్ సాబ్-2' ఉంటుందని దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'వకీల్ సాబ్' సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. వకీల్ సాబ్ సీక్వెల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అయితే స్క్రిప్ట్ పూర్తయినా ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి టైం పట్టే అవకాశముంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'PKSDT'(వినోదయ సిత్తం రీమేక్), 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే ఏడాదికి పైగా పడుతుంది. దానికితోడు వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఈ లెక్కన వకీల్ సాబ్ సీక్వెల్ పట్టాలెక్కాలంటే 2024 తరువాతే అవుతుందేమో!.