English | Telugu

ఏం చూసుకొని 'ఉస్తాద్'కి ఇంత ధైర్యం?

పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉంటే.. చిన్న సినిమాలు వెనకడుగు వేస్తుంటాయి. అయితే ఒక కుర్ర హీరో మాత్రం.. బరిలో పెద్ద హీరోల సినిమాలు ఉన్నా తగ్గేదేలే అంటున్నాడు. ఈ వారం సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఆగస్టు 10న 'జైలర్', ఆగస్టు 11న 'భోళా శంకర్' విడుదల కానున్నాయి. అయితే వీటితో పాటు ఆగస్టు 12న 'ఉస్తాద్' విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది.

శ్రీ‌ సింహా, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఫణిదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉస్తాద్'. వారాహి చలన చిత్రం నిర్మించిన ఈ సినిమాని ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు గత నెలలో ప్రకటించారు. ముందురోజు(ఆగస్టు 11న) మెగాస్టార్ మూవీ ఉంచుకొని 'ఉస్తాద్' విడుదలవుతుందా? చివరి నిమిషంలో వాయిదా పడుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ 'ఉస్తాద్' మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ సినిమా ఆగస్టు 12నే విడుదలవుతోంది. అందుకు తగ్గట్లుగా చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా చేస్తోంది. చిరంజీవి సినిమా అంటే కంటెంట్, టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. దానికి తోడు రజినీకాంత్ 'జైలర్' కూడా ఉంది. ఈ రెండు సినిమాల హడావుడిలో ప్రేక్షకులు అసలు 'ఉస్తాద్'ని పట్టించుకుంటారా అనే సందేహలున్నాయి. అయినప్పటికీ 'ఉస్తాద్' ధైర్యంగా ముందడుగు వేయడం ఆసక్తికరంగా మారింది. కంటెంట్ మీద నమ్మకమే 'ఉస్తాద్' టీంకి ఇంత ధైర్యం రావడానికి కారణమేమో చూడాలి.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడైన శ్రీ‌ సింహా 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త', 'భాగ్ సాలే' సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. ఇప్పుడు 'ఉస్తాద్' ఫలితం శ్రీ‌ సింహా కి చాలా కీలకం. అలాంటిది ఏకంగా సూపర్ స్టార్, మెగాస్టార్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న శ్రీ‌ సింహా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.