English | Telugu
నాని విజయ్ ని అందుకోవడం కష్టమేనా!
Updated : Apr 3, 2023
టాలీవుడ్ టైర్-2 హీరోలలో టాప్ ఎవరంటే నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తాయి. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొని వరుస విజయాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి నాని బాగా చేరువ కాగా, విజయ్ కొద్ది కాలంలోనే సంచలన విజయాలు అందుకొని యూత్ కి బాగా చేరువయ్యాడు. ఇలా ఇద్దరు హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా పరంగా మాత్రం నాని కంటే విజయ్ ముందున్నాడు.
విజయ్ కెరీర్ లో 'గీత గోవిందం' సినిమా దాదాపు రూ.70 కోట్ల షేర్ రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది. అయితే నాని కెరీర్ లో ఇప్పటిదాకా రూ.50 కోట్ల షేర్ మూవీ లేదు. మొన్నటిదాకా రూ.40 కోట్ల షేర్ తో 'MCA'(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ నాని కెరీర్ లో టాప్ గ్రాసర్ గా ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి 'దసరా' మూవీ వచ్చింది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. నేడో రేపో రూ.50 కోట్ల షేర్ మార్క్ అందుకొని, రూ.60 కోట్ల దిశగా పయనించే అవకాశముంది. అయితే ఈ సినిమా 'గీత గోవిందం' వసూళ్లను క్రాస్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'గీత గోవిందం' యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది కాబట్టి, రిపీటెడ్ ఆడియన్స్ తో 70 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. 'దసరా' ఊర మాస్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ అయితే రికార్డు స్థాయిలో వచ్చాయి కానీ.. 'గీత గోవిందం' స్థాయిలో లాంగ్ రన్ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాంగ్ రన్ ఉండాలంటే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఉండాలి. పైగా ఏప్రిల్ 7న 'రావణాసుర', 'మీటర్' మొదలుకొని ఏప్రిల్ లో పలు సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే విడుదలైన వారం రోజుల నుంచే ఇతర సినిమాల నుంచి దసరాకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. మరి వీటిని దాటుకొని దసరా ఏ స్థాయిలో వసూళ్ళు రాబడుతుందో చూడాలి. రూ.60 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. కానీ రూ.70 కోట్ల షేర్ రాబట్టి 'గీత గోవిందం' వసూళ్ళను దాటాలంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతం జరగాలి. మరి దసరా.. గీత గోవిందంను దాటేసి టైర్-2 హీరోల అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ లో నిలుస్తుందో, రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందో చూడాలి.