English | Telugu
ఎన్టీఆర్ 'దేవర'కు పోటీగా రెండు పాన్ ఇండియా సినిమాలు!
Updated : Nov 12, 2023
'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి కొరటాల శివ దర్శకుడు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడదే సమయంలో మరో రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
1996లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కలయికలో వచ్చిన 'ఇండియన్'(భారతీయుడు) తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో 'ఇండియన్-2' రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'దేవర' విజయం ఎన్టీఆర్ కి కీలకం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ ఇమేజ్ ని 'దేవర'తో మరో స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. అయితే 'దేవర' విడుదలైన ఐదారు రోజులకే 'కంగువా', 'ఇండియన్-2' రూపంలో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'దేవర' ఓపెనింగ్స్ కి అయితే డోకా లేదు కానీ.. రెండోవారం కలెక్షన్లపై ఆ రెండు సినిమాలు ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశముంది. మరి దీనిని దాటుకొని 'దేవర' చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.