English | Telugu

అప్పుడు టాప్‌ కమెడియన్‌ - ఇప్పుడు గుడి మెట్లే ఆధారం!

కామెడీ చెయ్యడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్‌. కేవలం డైలాగులు చెప్పి నవ్వించడమే కాదు, తమ బాడీ లాంగ్వేజ్‌తో, కామెడీ టైమింగ్‌తో నవ్వించిన వారే ఇండస్ట్రీలో రాణిస్తారు. అలాంటి వారిలో పాకీజా ఒకరు. దాదాపు 30 సంవత్సరాల క్రితం చాలా తెలుగు సినిమాల్లో తన కామెడీతో అలరించిన పాకీజా ఇప్పుడు దీనస్థితిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్న వార్త అందర్నీ కలచివేస్తోంది. పాకీజా అసలు పేరు వాసుకి. ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో బ్రహ్మానందం కాంబినేషన్‌లో ఆమె చేసిన కామెడీకి వచ్చిన అప్లాజ్‌ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కామెడీ కోసమే రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో తనదైన కామెడీతో అందర్నీ నవ్వించింది. తెలుగు, తమిళ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించిన పాకీజా ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది.
వాసుకి నటిగా బిజీగా ఉన్న టైమ్‌లోనే తల్లికి క్యాన్సర్‌ రావడంతో ఆమెకు వైద్యం చేయించేందుకు, ఇతర కుటుంబ అవసరాలకు అప్పటివరకు ఆమె సంపాదించుకున్నదంతా హరించుకుపోయింది. తమిళనాడుకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ తరఫున స్పీకర్‌ పర్సన్‌గా పలు బాధ్యతలు నిర్వహించింది. జయలలిత చనిపోయిన తర్వాత వాసుకి పరిస్థితి మరీ దారుణమైపోయింది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితికి వచ్చేసింది. ఒక యూట్యూబ్‌ ఛానల్‌కి వాసుకి ఇచ్చిన ఇంటర్వ్యూతో విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి 2 లక్షలు పంపించారు. ఆ డబ్బుతో హైదరాబాద్‌ చేరుకొని అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ‘మా’లో సభ్యత్వం ఇప్పించిన మంచు విష్ణు ఖరీదైన కంటి ఆపరేషన్‌ కూడా చేయించారు. యూసఫ్‌గూడలో రూ.10వేలకు చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్న వాసుకి సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. ఉన్న డబ్బంతా అయిపోయింది. చిత్రపురి కాలనీలోనైనా ఇల్లు దొరుకుతుందేమోనని చూసింది. అక్కడ ఖాళీ లేకపోవడంతో చేసేది లేక తిరుపతి వచ్చి గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో బిక్షాటన చేసుకుంటోంది. ఒకప్పుడు బిజీ ఆర్టిస్టుగా ఉన్న వాసుకి జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల వల్ల దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. కమెడియన్‌గా మంచి టాలెంట్‌ ఉన్న వాసుకికి సినిమాల్లో అవకాశాలు రాక ఇలా దీనస్థితికి రావడం నిజంగా దురదృష్టమే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.