English | Telugu

‘ఎక్స్‌ట్రా’ సూపర్‌హిట్‌ అయితే.. అది ఆ ముగ్గురికీ ప్లస్సే!

ఇప్పటివరకు హీరో నితిన్‌ కెరీర్‌ని పరిశీలిస్తే ఒక సినిమా హిట్‌ అయిందంటే దాని తర్వాత వచ్చే కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వాల్సిందే. ఆ తర్వాతే అతనికి మళ్ళీ హిట్‌ వస్తుంది. కొన్ని ఫ్లాప్‌ సినిమాల తర్వాత చేసిన ‘భీష్మ’ సూపర్‌హిట్‌ అయ్యింది. ఈ సినిమా తర్వాత నితిన్‌ హీరోగా వచ్చిన చెక్‌, రంగ్‌దే, మేస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ తప్పకుండా తనకు మంచి హిట్‌నిస్తుందని నితిన్‌ నమ్ముతున్నాడు. అందుకే దర్శకుడు వంశీపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్‌ 8న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా దర్శకుడు వక్కంతం వంశీ గురించి చెప్పాలంటే.. కిక్‌, ఎవడు, రేసుగుర్రం, ఊసరవెల్లి, టెంపర్‌ వంటి సూపర్‌హిట్‌ సినిమాలకు వరసగా స్టోరీలు అందించి సక్సెస్‌ఫుల్‌ రైటర్‌ అనిపించుకున్నాడు. కొన్ని సినిమాలకు డైలాగ్‌ రైటర్‌గా కూడా పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. రైటర్‌గా ఎంతో సక్సెస్‌ అయిన వంశీ డైరెక్టర్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. అల్లు అర్జున్‌ హీరోగా అతను చేసిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్‌ జోలికి వెళ్ళలేదు. తాజా నితిన్‌ హీరోగా ఎక్స్‌ట్రా’ అనే ఓ డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తప్పకుండా హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు వంశీ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనిపిస్తోంది. ఈ సినిమాతో వంశీ డైరెక్టర్‌గా కూడా సక్సెస్‌ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ నటించిన శ్రీలీలకు కూడా ఈ సినిమా విజయం సాధించడం ఎంతో అవసరం. పెళ్లిసందడి చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత రవితేజతో చేసిన ‘ధమాకా’ సూపర్‌హిట్‌ అవ్వడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్‌గా అవకాశాలు వెల్లువెత్తాయి. అరడజనుకుపైగా సినిమాలతో ఫుల్‌ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. అయితే వరసగా ఆమె చేసిన సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘స్కంద’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది శ్రీలీల. ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్‌ కేసరి ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా కూడా విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆదికేశవ’ మళ్లీ ఆమెను నిరాశపరచింది. ఇప్పుడు నితిన్‌తో చేసిన ‘ఎక్స్‌ట్రా’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయితే తన కెరీర్‌ గ్రాఫ్‌ పుంజుకుంటుందని ఆమె అభిప్రాయం.