English | Telugu

‘డ్రింకర్‌ సాయి’ మూవీ రివ్యూ

నటీనటులు: ధర్మ, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సమీర్‌, ఎస్‌.ఎస్‌.కాంచి, భద్రం, కిర్రాక్‌ సీత, రీతు చౌదరి, ఫన్‌ బకెట్‌ రాజేశ్‌, రాజ ప్రజ్వల్‌ తదితరులు 
సంగీతం: శ్రీవసంత్‌ 
సినిమాటోగ్రఫి: ప్రశాంత్‌ అంకిరెడ్డి 
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ 
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ 
బ్యానర్‌: ఎవరెస్ట్‌ సినిమాస్‌, స్మార్ట్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
రచన, దర్శకత్వం: కిరణ్‌ తిరుమలశెట్టి 
విడుదల తేదీ: 27.12.2024

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు టాలీవుడ్‌లో నిర్మాణం జరుపుకుంటూ ఉంటాయి. అందులో కొన్ని యూత్‌ని టార్గెట్‌ చేస్తూ రూపొందిస్తుంటారు. లవ్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అంశాలను జోడిస్తూ కథ చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే అలాంటి కొన్ని సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. ఈ తరహా యూత్‌ఫుల్‌ మూవీస్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయితే డెఫినెట్‌గా పెద్ద విజయాలను అందుకుంటాయి. అలాంటి ఓ యూత్‌ఫుల్‌ మూవీ ‘డ్రింకర్‌ సాయి’. మరి ఇలాంటి యూత్‌ఫుల్‌ మూవీకి ‘డ్రింకర్‌ సాయి’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు? యూత్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఏం ఉన్నాయి? ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రేక్షకులు ఈ సినిమాకి ఎలాంటి ఫలితాన్ని అందించారు అనే విషయాల గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

సాధారణంగా యూత్‌ సినిమాలో హీరో అల్లరి చిల్లరగా తిరుగుతున్నట్టుగా, జీవితం పట్ల అవగాహన లేకుండా చూపిస్తుంటారు. ఆ తర్వాత అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించడం, దాంతో తన లైఫ్‌ స్టైల్‌ని మార్చుకోవడం జరుగుతుంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి కంటేంటే ఉంటుంది. ధనిక కుటుంబంలో పుట్టిన సాయి(ధర్మ) స్నేహితులతో కలిసి జులాయిలా తిరుగుతుంటాడు. చెడు అలవాట్లకు బానిసవుతాడు. జీవితాన్ని జాలీగా గడిపేందుకే ఇష్టపడతాడు. ఆ సమయంలో భాగీ(ఐశ్వర్య శర్మ) పరిచయమవుతుంది. అది కూడా అనుకోకుండా జరుగుతుంది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నట్టుగా వెంటనే ఆమె ప్రేమలో పడిపోతాడు సాయి. తన ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేస్తాడు. తనకి అతన్ని ప్రేమించడం ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. ఆ క్రమంలోనే ఓ సంఘటన జరుగుతుంది. అప్పుడు సాయి ప్రేమను రిజెక్ట్‌ చేస్తుంది. మొదట ప్రేమించినట్టు ఎందుకు నటించింది, ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్‌ చేసింది? సాయికి ఎదురైన సమస్య ఏమిటి? దాన్నుంచి బయటపడ్డాడా? చివరికి సాయి ప్రేమను భాగీ యాక్సెప్ట్‌ చేసిందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ : 

ప్రస్తుతం యూత్‌ ఎలా ఉంది, వారి అలవాట్లు, లివింగ్‌ స్టైల్‌ ఎలా ఉంది అనేది ప్రధానంగా సినిమా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఎంపిక చేసుకున్న కథలో బలం లేదు అనిపిస్తుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. అయితే హీరో, హీరోయిన్‌ల క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే వారి నుంచి చక్కని పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఒక చక్కని కథను ప్రేక్షకుల ముందు ఉంచే క్రమంలో పాటలనేవి ఎప్పుడూ అడ్డంకిగానే ఉంటాయి. కథలో మిళితమైన పాటలైతే కథా గమనం ఎప్పుడూ దెబ్బ తినదు. కథకు సంబంధం లేని పాటలు వచ్చినపుడు ఖచ్చితంగా అది బ్రేక్‌ అవుతుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే అందులోనూ కొన్ని కొత్త అంశాలను తీసుకు రావడం వల్ల ఆ లోపం స్పష్టంగా కనిపించదు. ఏది ఏమైనా తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పడంలో దర్శకుడు సఫలం అయ్యాడని చెప్పొచ్చు.

నటీనటులు : 

సాయి క్యారెక్టర్‌లో ధర్మ, భాగీగా ఐశ్వర్య శర్మ రాణించారు. తమకు ఇచ్చిన క్యారెక్టర్లను పూర్తిగా అర్థం చేసుకొని న్యాయం చేశారని చెప్పొచ్చు. కొత్త వారైనప్పటికీ అనుభవం ఉన్న ఆర్టిస్టుల్లాగే స్క్రీన్‌పై కనిపించారు. ధర్మ విషయానికి వస్తే నటనలోనే కాకుండా డాన్సులు చేయడంలో, ఫైట్స్‌లో, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు.  ఐశ్వర్యశర్మకు తన క్యారెక్టర్‌ ద్వారా ఎమోషన్స్‌ను పండిరచే అవకాశం లభించింది. శ్రీకాంత్‌ అయ్యాంగార్‌, సమీర్‌, ఎస్‌.ఎస్‌.కాంచి, భద్రం, కిర్రాక్‌ సీత, రీతు చౌదరి తదితరులు ఫర్వాలేదు అనిపించారు. 

సాంకేతిక నిపుణులు : 

ఇలాంటి సినిమాకు కావాల్సిన టెక్నికల్‌ వేల్యూస్‌ బాగా కుదిరాయి. శ్రీవసంత్‌ సంగీతం బాగుంది. ప్రశాంత్‌ అంకిరెడ్డి చక్కని విజువల్స్‌తో సినిమాకి ఒక లుక్‌ తీసుకు రావడంలో తోడ్పడ్డారు. మార్తాండ్‌ కె.వెంకటేష్‌ ఎడిటింగ్‌ ఎప్పటిలాగే బాగుంది. అయితే సినిమా నిడివి కొంత ఎక్కువైందా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ట్రిమ్‌ చేయదగ్గ సీన్లు సినిమాలో ఉన్నాయి. వాటిని కట్‌ చేసి ఉంటే గ్రిప్పింగ్‌గా ఉండేది. నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ సినిమాను రిచ్‌గా నిర్మించడంలో ఎలాంటి రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టి.. తాను అనుకున్న పాయింట్‌ను ఆడియన్స్‌కి కనెక్ట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు. 

ఫైనల్‌గా చెప్పాలంటే.. :

హీరో క్యారెక్టర్‌ చెడు సావాసాలతో, దురలవాట్లతో జులాయిగా తిరిగేదే అయినా ఓ అమ్మాయి ప్రేమవల్ల వాటిని పక్కనపెట్టి గుడ్‌ బాయ్‌గా ఎలా మారాడు అనే పాయింట్‌ను చూపించిన విధానం బాగుంది. ఈ క్రమంలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ సినిమాలు, పాన్‌ ఇండియా మూవీస్‌తో బోర్‌ ఫీల్‌ అవుతున్న యూత్‌కి ఈ సినిమా ఒక రిలీఫ్‌ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రేటింగ్‌: 2.75/5