English | Telugu
బర్త్ డే రోజున బాధపడ్డ సూర్య
Updated : Jul 24, 2023
వెర్సటైల్ హీరో సూర్య జూలై 23న తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఆయన తన తాజా చిత్రం కంగువా నుంచి గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అంతా సవ్యంగా ఉందని అనుకుంటున్న సమయంలో సూర్యకు అనుకోని విషయం తెలిసిందే. అదేంటంటే సూర్య పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ బ్యానర్ కడుతున్న ఇద్దరు అభిమానులు కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఆ యువకుల కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
సూర్య కేవలం ఇప్పుడు కోలీవుడ్ నటుడు మాత్రమే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ సంపాదించుకున్న విలక్షణ హీరో అనే చెప్పాలి. కథానాయకుడిగానే సినిమాలు చేస్తున్నప్పటికీ వైవిధ్యమైన సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలే. ఈ రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అది కూడా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో. ఆ రెండు సినిమాలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు అగరం ఫౌండేషన్ పేరుతో పేద విద్యార్థుల చదువుకు అండగా నిలబడుతున్నారు.
మంచి సినిమాలను చేస్తున్న ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గజిని సినిమా నుంచి సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేరోజున విడుదలవుతున్నాయి. ఇప్పుడు రాబోతున్న కంగువా సినిమా అయితే ఏకంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది. దీనికి శివ దర్శకుడు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సూర్య ఇప్పటి వరకు చేయనటువంటి క్యారెక్టర్‌తో మెప్పించబోతున్నారు.