English | Telugu

సూర్య రూ.600 కోట్ల సినిమా!

పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు ఉన్న క‌థానాయ‌కుడు సూర్య‌. విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో ఆయ‌న త‌న‌దైన క్రేజ్‌, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సూర్య త‌న సినిమాల‌ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కంగువా సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వాడివాస‌ల్ సినిమా లైన్‌లో ఉంది. అయితే తాజాగా సూర్య లైనప్‌లో మ‌రో భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి తెలిసింది. అదేంటంటే.. ఈ వెర్స‌టైల్ యాక్ట‌ర్ బాలీవుడ్ మేక‌ర్‌తో భారీ బ‌డ్జెట్ మూవీ చేయ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇంత‌కీ వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా బ‌డ్జెట్ రూ.600 కోట్లు.

వివ‌రాల్లోకి వెళితే, బాలీవుడ్‌కి చెందిన రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్ర రీసెంట్‌గా సూర్య‌ను క‌లిసి క‌ర్ణ అనే స‌బ్జెక్ట్‌ను వినిపించార‌ట‌. మెయిన్ లైన్‌కు ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయ‌మ‌న్నార‌ని టాక్‌. ఈ రేంజ్‌లో బ‌డ్జెట్ పెట్టి సినిమాను చేశారంటే ఇండియ‌న్ లాంగ్వేజెస్‌ల‌లో సినిమాను రిలీజ్ చేయ‌టానికి రెడీ అయిన‌ట్లే. మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి పాత్ర‌ను ఆధారంగా చేసుకునే ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. కేవ‌లం సూర్య మాత్ర‌మే కాకుండా పాన్ ఇండియాలోని స్టార్స్ అంద‌రూ న‌టిస్తారంటున్నారు మ‌రి.

ప్ర‌స్తుతం శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ కంగువాతో సూర్య బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏకంగా ప‌ది భాష‌ల్లో రిలీజ్ కానుంది. కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ సినిమాకు నిర్మాత‌. రీసెంట్‌గానే టీజ‌ర్ విడుద‌లైంది. మూవీ ఈ ఏడాది చివ‌ర‌లో లేదా వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో కానీ విడుద‌ల కావ‌చ్చు.