English | Telugu
మోహన్ లాల్ కొడుకుగా రోషన్.. తండ్రి బాటలోనే!
Updated : Jul 13, 2023
'పెళ్ళి సందD'తో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్నాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. వైజయంతీ మూవీస్ వారి కాంపౌండ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు.. ఓ పాన్ - ఇండియా మూవీలోనూ భాగమయ్యాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో 'వృషభ' పేరుతో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రాబోతోంది. నంద కిశోర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి జనార్ధన మహర్షి రచన చేస్తున్నారు. కాగా, ఇందులో మోహన్ లాల్ కి కొడుకు పాత్రలో రోషన్ ఎంపికయ్యాడు. ప్రధానంగా మలయాళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా.. ఇతర భాషల్లో అనువాదం కానుంది. ఇందులో సిమ్రాన్, గరుడ రామ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో మోహన్ లాల్ నటించిన 'విలన్' (2017) మూవీతోనే శ్రీకాంత్ మలయాళ చిత్ర సీమలో తొలి అడుగేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడదే బాటలో రోషన్ కూడా మోహన్ లాల్ సినిమాతోనే అక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి.. మోహన్ లాల్ మూవీతో రోషన్ ఎలాంటి గుర్తింపు పొందుతాడో చూడాలి.