English | Telugu
చేతులెత్తేసిన 'స్పై'.. స్టడీగా 'సామజవరగమన'!
Updated : Jul 4, 2023
జూన్ 29న 'స్పై'తో నిఖిల్, 'సామజవరగమన'తో శ్రీవిష్ణు బాక్సాఫీస్ బరిలోకి దిగారు. మంచి అంచనాలతో విడుదలైన స్పై.. నిఖిల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిన ఈ సినిమా కలెక్షన్లు రెండో రోజు నుంచే దారుణంగా పడిపోయాయి. ఇక ఐదో రోజుకి పూర్తిగా చేతులెత్తేసింది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.6.02 కోట్ల షేర్ రాబట్టిన 'స్పై'.. ఐదో రోజు 28 లక్షల షేర్ మాత్రమే రాబట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా దాదాపు రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఇప్పటిదాకా రూ.10.26 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే దాదాపు ఈ సినిమా రన్ పూర్తయినట్టే. ఈ లెక్కన ఈ సినిమా బయ్యర్లకు కనీసం ఐదు కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశముంది. 'స్పై' పరిస్థితి ఇలా ఉంటే, 'సామజవరగమన' పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటికే లాభాల్లోకి ఎంటరైన ఈ సినిమా, స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
పెద్దగా అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సామజవరగమన' మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో కుటుంబమంతా చూసి నవ్వుకోదగ్గ సినిమాలు తగ్గిపోగా, ఆ లోటుని ఈ సినిమా తీర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. యూఎస్ లోనూ అదిరిపోయే వసూళ్లు రాబడుతూ హాఫ్ మిలియన్ దిశగా దూసుకుపోతోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.1.14 కోట్ల షేర్ రాబట్టిన 'సామజవరగమన'.. ఐదో రోజు సోమవారం అయినప్పటికీ రూ.91 లక్షల షేర్ రాబట్టిందంటే కలెక్షన్లు ఎంత నిలకడగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా రూ.3.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఇప్పటిదాకా రూ.6.32 షేర్ రాబట్టి మంచి లాభాలతో దూసుకుపోతోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా పది కోట్ల షేర్ రాబట్టిన ఆశ్చర్యం లేదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.