English | Telugu

సోనూ సూద్‌ను అరెస్ట్‌ చెయ్యాలి.. వివాదాస్పద ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం!

సినిమాల్లో విలన్‌గా నటిస్తూ ప్రేక్షకుల్ని భయభ్రాంతులకు గురి చేసే సోనూ సూద్‌ నిజ జీవితంలో హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా కష్టంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి వారి పాలిట దేవుడు అనిపించుకున్నాడు. రీల్‌ లైఫ్‌లో విలన్‌ అయినా రియల్‌ లైఫ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్‌ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఎక్స్‌లో అతను చేసిన ట్వీట్‌ పెద్ద దుమారమే రేపుతోంది.

విషయమేమిటంటే.. చండీగఢ్‌లోని ఢిల్లీ దర్బార్‌ దాబాలో ఓ వ్యక్తి రోటీలు తయారు చేసే క్రమంలో వాటిపై ఉమ్మి, వాటినే కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు ఒకరు వీడియో తీసి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతూ ఆ వ్యక్తి చేసిన పనిని తప్పు బట్టారు. ఈ వీడియోపై సోనూ సూద్‌ స్పందిస్తూ ‘మన శ్రీరాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లను ఆరగించాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి చేసిన రోటీలను నేను ఎందుకు తినలేను? అహింసతోనే హింసను జయించగలం. మానవత్వం అనేది ఎప్పుడూ చెక్కు చెదరకూడదు’ అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ చూసిన వారంతా షాక్‌ అవుతున్నారు. సోనూ సూద్‌ ఇలాంటి ట్వీట్‌ చేయడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారు.

దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ‘వారి మతంలో అలాంటిది ఉంటే, ఇంట్లో అలా చేసుకోవాలి. అంతేతప్ప ఎంతో మంది వచ్చే హోటల్‌లో ఇలాంటి నీచమైన పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌’, ‘మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్తులు అందరూ కలిసే ఉంటారు. ఎవరి ఆచారాలు వాళ్ళవి. వాటిని మనం గౌరవించాలి. అంతే తప్ప ఇతరులపై వాటిని రుద్దే ప్రయత్నం చేయకూడదు’, ‘హిందువులు పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవడానికి, తినడానికి ఇతర మతస్తులు అంగీకరించరు. ఎందుకంటే వాటిని తినకూడదు అని వారి మతంలో ఉందేమో. అందుకే వారు తీసుకోవడం లేదేమో’, ‘సోను దాన్ని సమర్థించడం కరెక్ట్‌ కాదు’, ‘అందరి మనోభావాలను దెబ్బతీసిన సోనూ క్షమాపణ చెప్పాలి’, ‘ఇలాంటి వికృతమైన చర్యలను సపోర్ట్‌ చేస్తున్న సోనూను అరెస్ట్‌ చెయ్యాలి’.. అంటూ సోనూ సూద్‌ను ట్రోల్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.