Read more!

English | Telugu

‘సత్తిగాని రెండెకరాలు’ సినిమా రివ్యూ

సినిమా: సత్తిగాని రెండెకరాలు
నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, అనీషా దామ, వంశీధర్ గౌడ్, మోహన శ్రీ సురాగ, రాజ్ తీరందాస్, బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: జై క్రిష్
ఆర్ట్ : జి ఎమ్ శేఖర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్, నిఖిలేష్
రచన, దర్శకత్వం, ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండ
నిర్మాత: వై. రవి శంకర్, నవీన్ ఏర్నేని
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, ఆహా


పాన్ ఇండియా మూవీ 'పుష్ప' సినిమాలో కేశవగా నటించి గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ ప్రతాప్ బండారి.. ఫుల్ లెంత్ హీరోగా చేసిన సినిమా 'సత్తిగాని రెండెకరాలు'. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం.

కథ: 

'బలగం' సినిమాలో కొమరయ్య పాత్ర చేసిన సుధాకర్ రెడ్డి ఈ సినిమాలో సత్తికి తాతగా చేసాడు. సత్తి వాళ తాత చనిపోయేముందు అతనికి రెండెకరాల భుమి ఇస్తాడు. అయితే సత్తికి భార్య.. ఒక కొడుకు కూతురు ఉంటారు. అయితే సత్తి వాళ్ళ పాపకి హార్ట్ లో హోల్ ఉందని డాక్టర్లు చెప్తారు. అయితే ఆపరేషన్ కోసం ఇరవై అయిదు లక్షల డబ్బు అవసరం ఉందని డాక్టర్స్ చెప్పడంతో.. ఊర్లో ఉన్న సర్పంచ్ ఆ రెండెకరాలను అమ్మేసి పాపని బతికించుకోమని చెప్తాడు. అయితే అదే టైంలో అతనికి రోడ్ మీద వెళ్ళే ఒక కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందులో ఉన్న అతను చనిపోతాడు. అయితే ఆ కార్లో ఒక సూట్ కేస్ ఉండటంతో అద్దాలు పగులకొట్టి ఆ సూట్ కేస్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ అంజి దగ్గరికి వస్తాడు సత్తి. ఇక ఆ సూట్ కేస్ లో ఏముంది? అందులో ఉన్న వాటితో సత్తి సమస్యలు తీరాయా? సత్తికి ఉన్న రెండెకరాలను అతను అమ్మేసాడా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ: 

సత్తి వాళ్ళ తాత చనిపోయేముందు అతనికి రెండెకరాల భూమిని ఇస్తాడు. అయితే సత్తికి ఆ భూమి ఉపయోగపడిందా? సత్తికి దొరికిన ఆ సూట్ కేస్ అతని జీవితాన్ని మార్చిందా అనే ఆసక్తికరమైన అంశాలతో మొదలైన ఈ కథ.‌. చివరి వరకు వినోదాన్ని అందిస్తూ క్రైమ్ మిస్టరినీ చేదిస్తుంది. అయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎస్ఐ నిరంజన్ రెడ్డిగా బిత్తిరి సత్తి వినోదాన్ని అందించాడు.‌ ముఖ్యంగా ఎస్ఐ కి కానిస్టేబుల్ స్వామికి మధ్య జరిగే సీన్స్, డిటెక్టివ్ గా వచ్చిన వెన్నెల కిషోర్ కి ఎస్ఐ కి మధ్య జరిగే సీన్స్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి.

కథ ప్రథమార్థం వరకూ ఆ సూట్ కేస్ చుట్టూ తిప్పిన అభినవ్.. ద్వితీయార్థంలో కథని ఆసక్తికరంగా మలిచాడు.  సత్తి తన రెండెకరాలకు సంబంధించిన పేపర్స్ ని సర్పంచ్ కి అప్పగించి అతనిచ్చే డబ్బులతో జల్సాలు చేస్తూ కుటుంబాన్ని నడుపుతుంటే ఆ విషయం తెలుసుకున్న సత్తి భార్య పుట్టింటికి వెళ్ళే సీన్స్, అక్కడికి సత్తి వెళ్ళి బ్రతిమాలే సీన్స్ అన్నీ కూడా ప్రతీ కుటుంబంలో సాగే గొడవలుగా మలిచిన తీరు బాగుంది. అయితే సత్తి స్నేహితుడిగా అంజి పాత్రలో రాజ్ తీరందాస్ చిన్నా చితక దొంగతనాలు చేస్తూ వాటితో జీవితం గడుపుతూ ఉండగా సడన్ గా ఈ క్రైమ్ లో చిక్కుకోవడం అంతా ఒక ఫ్లోలో వెళ్తుంది. 

కథ, కథనం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కాస్త గ్రిస్పింగ్ గా ఉంటే బాగుండేది. అభినవ్ రెడ్డి రాసుకున్న కథని తెరపై సరిగ్గా చూపించలేదనే చెప్పాలి. టెంపో మిస్ అయింది. చాలా సాదాసీదాగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సత్తి తన రెండెకరాలు అమ్మేసి వాళ్ళ పాపకి ఆపరేషన్ చేయిస్తే సరిపోతుంది. దీనికోసం సత్తి లైఫ్ ని తలకిందులుగా చేసి మళ్ళీ చివరలో అతనికి అదృష్టం కలిసొచ్చింది అన్నట్టుగా చూపించడం చూసే ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ బాగున్నా.. స్లో టేకింగ్ వల్ల ఆ కామెడీ సరిగ్గా పండలేదు. ఎస్ఐ కి కానిస్టేబుల్ కి ఉన్నంత నాలెడ్జ్ కూడా ఉండదని చూపించినా అది నవ్వించడానికే అంటే సరిపోదు కదా.. కామెడీని  సినిమా చివరిదాకా మోసుకెళ్ళడం కత్తి మీద సాములాంటిదే. అయితే ఇందులో అది పనొ చేయలేదు.  ఒక షార్ట్ ఫిల్మ్ ని సినిమాగా తీసినట్టుగా ఉంది. అయితే సినిమా మొత్తం కేశవ్ సహజమైన నటన గురించి చెప్పుకోవాలి. అయితే బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్  కామెడీతో అక్కడక్కడ కాస్త నవ్వుకోవడం తప్ప సినిమాలో ఏం కొత్తదనం లేదు.

కాసర్ల శ్యామ్, నిఖిలేష్ అందించిన సాహిత్యం బాగుంది. జై క్రిష్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.  పల్లెటూరితో పాటు ప్రకృతి అందాలని విశ్వనాథ్ రెడ్డి చాలా చక్కగా చూపించాడు. మైత్రి మేకర్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సత్తి పాత్రకు ప్రతాప్ కుమార్ న్యాయం చేసాడు. వాళ్ళ తాత ఇచ్చి‌న రెండెకరాల కోసం ఎంత దూరమైన వెళ్ళే అతని స్వభావం మొదట్లో కాస్త విసుగు తెప్పించినా చివరికి నచ్చేస్తుంది. సత్తికి ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడిగా అంజి( రాజ్ తీరందాస్)  ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఎస్ఐ నిరంజన్ గా సత్తిరెడ్డి ఆకట్టుకున్నాడు. ఎస్ఐ నిరంజన్, కానిస్టేబుల్ స్వామిల మధ్య జరిగే సంభాషణలు కామెడీగా అనిపిస్తాయి. సర్పంచ్ గా ఐరేని మురళీధర్ గౌడ్ ఒదిగిపోయాడు. వెన్నెల కిషోర్ ప్రాక్టికల్ జోక్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ లో దిట్టా అన్నట్టుగా ప్రొఫెషనల్ డిటెక్టివ్ పాత్రలో మెప్పించాడు.

తెలుగువన్ ఎనాలసిస్: 

క్రైమ్ కామెడీగా తెరకెక్కిన 'సత్తిగాని రెండెకరాలు' ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాస్త స్లో సీన్స్ తప్పితే చివరివరకు సినిమా అలరిస్తుంది.

రేటింగ్: 2.5 / 5

✍🏻‌. దాసరి మల్లేశ్