English | Telugu
'సలార్' అప్డేట్ ఇచ్చిన సప్తగిరి.. 2000 కోట్లు పక్కా!
Updated : Jul 9, 2023
'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించగల సినిమా అని, కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులంతా భావిస్తున్న చిత్రం 'సలార్'. పైగా ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఆయన గత చిత్రం 'కేజీఎఫ్-2' కూడా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో తెలిసిందే. 'బాహుబలి' హీరో ప్రభాస్, 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న 'సలార్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. తాజాగా నటుడు సప్తగిరి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
'సలార్' సినిమాలో టాలీవుడ్ నటుడు, కమెడియన్ సప్తగిరి కూడా నటిస్తున్నాడు. తాజాగా తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేసిన సప్తగిరి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని, బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేశాడు. సప్తగిరి నమ్మకం నిజమైతే ప్రభాస్ కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే రూ.2000 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా అవుతుంది. రూ.1800 కోట్ల గ్రాస్ తో ఇప్పుడు 'బాహుబలి-2' టాప్ లో ఉంది. ఇక 'కేజీఎఫ్-2'తో కన్నడ పరిశ్రమకి మొదటి రూ.1000 కోట్ల సినిమాని అందించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు 'సలార్'తో రూ.2000 కోట్ల క్లబ్ లో కూడా చేరతాడేమో చూడాలి.
సలార్ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సప్తగిరి డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పడం చూస్తుంటే మొదటి భాగం నిర్మాణాంతర కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయని అర్థమవుతోంది. ఇటీవల సలార్ టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఆగస్ట్ లో ట్రైలర్ విడుదల కానుంది.