English | Telugu
రామ్ చరణ్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ మూవీ!
Updated : Apr 19, 2023
యాక్సిడెంట్ కారణంగా కొంతకాలం కెమెరాకు దూరంగా ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష' ఈ శుక్రవారం(ఏప్రిల్ 21) ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తన మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి 'వినోదయ సిత్తం' రీమేక్ లో నటిస్తున్నాడు. దీనితో పాటు తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'ఏమైంది ఈ వేళ'తో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్ట్ ని చేసే ఛాన్స్ దక్కించుకున్న సంపత్.. 'రచ్చ'తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత 'బెంగాల్ టైగర్', 'గౌతమ్ నంద', 'సీటీమార్' సినిమాలతో పరవాలేదు అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు సాయి తేజ్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. సాయి తేజ్, సంపత్ నంది కలయికలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, జూన్ లేదా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి.