English | Telugu
'సామజవరగమన' సంచలనం.. పది కోట్ల లాభం, యూఎస్ లో మిలియన్ మార్క్!
Updated : Jul 10, 2023
శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'సామజవరగమన' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. మొదటి వీకెండ్ స్థాయిలో రెండో వీకెండ్ కలెక్షన్లు ఉండటం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకు పది కోట్ల లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. యూఎస్ లోనూ వన్ మిలియన్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది.
జూన్ 29న విడుదలైన 'సామజవరగమన' తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.80 లక్షల షేర్, రెండోరోజు రూ.68 లక్షల షేర్, మూడోరోజు రూ.1.07 కోట్ల షేర్ రాబట్టగా.. రెండో వారాంతంలోనూ తొమ్మిదో రోజు రూ.57 లక్షల షేర్, పదో రోజు రూ.80 లక్షల షేర్, 11వ రోజు రూ.93 లక్షల షేర్ తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 11 రోజుల్లో రూ.8.05 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.3.37 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.97 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.3.71 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.3.55 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.11.60 కోట్ల షేర్ రాబట్టింది.
ఓవరాల్ గా రూ.3.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'సామజవరగమన' ఇప్పటికే రూ.11.60 కోట్ల షేర్ సాధించి, ఎనిమిది కోట్లకు పైగా ప్రాఫిట్స్ చూసింది. ఫుల్ రన్ లో ఈ సినిమా పది కోట్ల ప్రాఫిట్స్ చూసినా ఆశ్చర్యంలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి ఓవర్సీస్ లో బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 800k డాలర్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా త్వరలోనే 1 మిలియన్ మార్క్ ని అందుకునేలా ఉంది.
మొదటి రెండు రోజులు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1.14 కోట్ల షేర్, రూ.1.04 కోట్ల షేర్ రాబట్టగా.. 10వ రోజు రూ.1.25 కోట్ల షేర్, 11వ రోజు రూ.1.23 కోట్ల షేర్ రాబట్టిందంటే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.