English | Telugu
ఘనంగా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ వేడుక
Updated : Apr 9, 2023
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదిక మీద తెలుగు జెండా ఎగురవేశారు. 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా పాట ఆస్కార్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఓ తెలుగు సినిమా పాట ఈ అరుదైన చరిత్రను సృష్టించడంతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు సినీ అభిమానులంతా ఎంతో సంబరపడ్డారు. తెలుగు గడ్డ మీదకు ఆస్కార్ తీసుకొచ్చిన కీరవాణి, చంద్రబోస్ ని తాజాగా సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించింది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో 'ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుక' ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీం తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, త్రివిక్రమ్, కాశీ విశ్వనాథ్, వై.వి.ఎస్ చౌదరి, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, చంద్రబోస్ ని ఘనంగా సత్కరించిన అతిథులు.. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.