English | Telugu

జెనీలియా ప్రెగ్నెంట్... క్లారిటీ ఇచ్చిన భర్త!

హ హ హాసిని అంటూ బొమ్మ‌రిల్లు సినిమాలో న‌టించిన జెనీలియాను అంత తేలిక‌గా ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేరు. స్క్రీన్ మీద ఆమె చేసిన అల్ల‌రి అలాంటిది మ‌రి. స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌నా న‌టించారు జెనీలియా. ఆ త‌ర్వాత రితేష్‌ని పెళ్లి చేసుకుని సెటిల‌య్యారు. ఇప్పుడు జెనీలియా, రితేష్ దంప‌తుల‌కు ఇద్ద‌రు కొడుకులు. ఇటీవ‌ల ముంబైలోని ఓ వేడుక‌కు జెనీలియా, రితేష్ ఇద్ద‌రూ క‌లిసి వెళ్లారు. అయితే జెనీలియా వేసుకున్న కాస్ట్యూమ్స్, ఫొటోల‌కు ఫోజులిచ్చిన తీరు చూసి అంద‌రూ జెనీలియా మ‌ళ్లీ ప్రెగ్నెంట్ అని అన్నారు. మూడో సారి తండ్రి కాబోతున్న రితేష్ అంటూ వార్త‌లు రాశారు. దీని గురించి స్పందించారు రితేష్ దేశ్ ముఖ్‌. మీరు మూడు విష‌యాల‌ను గుర్తుపెట్టుకోవాలి. నాకూ, జెనీలియాకు పెళ్లై దాదాపు పుష్క‌రం అవుతోంది. మేమిద్ద‌రం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులం. మూడోది ఇప్పుడు జెనీలియా ప్రెగ్నెంట్ కాదు అంటూ త‌న‌దైన శైలిలో చ‌మ‌త్క‌రించారు రితేష్ దేశ్ ముఖ్‌.

త‌న‌కు పిల్ల‌లంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు రితేష్‌. త‌న పెద్ద కొడుక్కి ఇప్పుడు ఎనిమిదేళ్ల‌న్నారు. రెండో కొడుక్కి ఏడేళ్ల‌న్నారు. ఇంకో ఇద్ద‌రు, ముగ్గురు పిల్ల‌ల‌తో నాన్నా అని పిలిపించుకోవ‌డానికి కూడా త‌న‌కేమీ ఇబ్బంది లేద‌ని చెప్పారు. అయితే ప్ర‌స్తుతం జెనీలియా ప్రెగ్నెంట్ కాద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో జెనీలియా ప్రెగ్నెంట్ అంటూ రాసుకొచ్చిన నార్త్ మీడియా నోరు మూసిన‌ట్ట‌యింది. రితేష్‌, జెనీలియా ఇటీవ‌ల మ‌ళ్లీ స్క్రీన్ మీద క‌లిసి న‌టించారు. తెలుగులో నాగ‌చైత‌న్య‌, స‌మంత న‌టించిన మ‌జిలి సినిమాను నార్త్ లో వారిద్ద‌రూ రీమేక్ చేశారు. చాలా మంచి స్పంద‌న తెచ్చుకుంది ఈ సినిమా. జెనీలియా సౌత్ రీ ఎంట్రీ గురించి కూడా ఇప్ప‌టికే చాలా సార్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ప‌ర్ఫెక్ట్ గా ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తార‌నే విష‌యం మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.