English | Telugu
జూనియర్ ముందు ఎన్టీఆర్ జీరో అట!
Updated : Feb 10, 2015
హమ్మా... రాంగోపాల్ వర్మ ఎంత మాటన్నాడు! ఎవరిని ఎవరితో పోలచ్చాడు..?
వర్మ పిచ్చి.. హైపిచ్‌లోకి వెళ్లినప్పుడల్లా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ.. కామెంట్లు విసురుతుంటాడు. అందులో కావల్సినంత ఫన్ను దొరుకుతుంది. పవన్ కల్యాణ్, కేసీఆర్, చిరంజీవి, మహేష్ బాబు... ఇలా ఎవ్వరినీ వదల్లేదాయన. పొగిడినా.. తిట్టినట్టే.. తిట్టినా పొగిడినట్టే అనిపించేలా మాట్లాడడం వర్మకే చెల్లు. ఇప్పుడు జూనియర్ పై బాణం విసిరాడు వర్మ. అది అలాంటిలాంటి బాణం కాదు. నేరుగా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయ్యేలాంటి బాణం.
టెంపర్ సినిమా వస్తోంది కదా..? అందరూ ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు. అందుకే వర్మ కూడా మాట్లాడాడు... కాకపోతే కాస్త అతిగా. టెంపర్‌లో ఎన్టీఆర్ నటన అద్భుతమూ, అమోఘమట. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ జూనియర్ నటన ముందు పెద్దాయన నందమూరి తారక రామారావు. ఎందుకూ పనికి రాడట. 50 ఏళ్ల ఎన్టీఆర్ కెరీర్‌లో టెంపర్‌తో పోల్చి చూడదగిన సినిమా ఒక్కటీ లేదట. అడవి రాముడు 17 సార్లు చూశా... టెంపర్ 27సార్లు చూస్తా అంటున్నాడు వర్మ. అంతేకాదు.. ఇక నుంచి ఎన్టీఆర్ వంశంలో ఎవరు పుట్టినా జూనియర్ పేరుతోనే పాపులర్ అవుతారట. టీడీపీ ఆఫీసుల్లో ఎన్టీఆర్ ఫొటో తీసి జూనియర్ ఫొటో పెట్టుకోమని సలహా కూడా ఇస్తున్నాడు. ఇదంతా పైత్యానికి పరాకాష్ట కాకపోతే మరేంటి?? ట‌్విట్టర్ ఒకటి ఉంది కదా అని ఏదిపడితే అది రాసేస్తే ఎలా..?? వర్మా.. ఇలా ఎంతకాలం, జనాలు నవ్వుకొంటున్నారు. ఆ మాటకొస్తే.. ఇలాంటి కామెంట్లు జూనియరే పట్టించుకోడు. ఇలాంటి పిచ్చిపిచ్చి పోలికలు ఆపేసి... తన సినిమా గొడవేదో తాను చూసుకొంటే మంచిది.