English | Telugu
రవిరాజా పినిశెట్టి బర్త్ డే స్పెషల్ః ఇండస్ట్రీ హిట్స్ స్పెషలిస్ట్
Updated : Jul 14, 2021
తెలుగునాట ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకులు అతికొద్ది మందే ఉన్నారు. వారిలో నిన్నటితరం అగ్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఒకరు. రీమేక్ సినిమాలకు చిరునామాగా నిలిచిన రవిరాజా కెరీర్ లో సక్సెస్ రేట్ ఎక్కువ అనే చెప్పాలి. మరీముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ వంటి అగ్ర కథానాయకుల కాంబినేషన్ లో మంచి విజయాలు చూశారాయన. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా.. హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు రూపొందించి ఆయా చోట్ల తనదైన ముద్రవేశారు రవిరాజా.
ఇక రవిరాజా ఖాతాలో ఉన్న ఇండస్ట్రీ హిట్స్ విషయానికి వస్తే.. `యముడికి మొగుడు` (1988), `చంటి` (1992), `పెదరాయుడు` (1995) చిత్రాలతో ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. ఎనిమిదేళ్ళ గ్యాప్ లో వచ్చిన ఈ మూడు చిత్రాలు కూడా దర్శకుడిగా రవిరాజా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీటిలో `చంటి`, `పెదరాయుడు` సినిమాలు తమిళ చిత్రాలకు రీమేక్ వెర్షన్స్. `చిన్నతంబి` (ప్రభు, ఖుష్బూ) ఆధారంగా `చంటి` (వెంకీ, మీనా) తెరకెక్కితే.. `నాట్టమై` (శరత్ కుమార్, ఖుష్బూ, మీనా)కి రీమేక్ గా `పెదరాయుడు` (మోహన్ బాబు, భానుప్రియ, సౌందర్య) రూపొందింది. ఇక చిరు `యముడికి మొగుడు` మాత్రం ఒరిజనల్ సబ్జెక్ట్ కాగా.. ఇది `అతిశయ పిరవి`(సూపర్ స్టార్ రజినీకాంత్) పేరుతో తమిళంలోకి రీమేక్ కావడం విశేషం.
ఇలా.. ఇండస్ట్రీ హిట్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు జూలై 14. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.