English | Telugu
'రావణాసుర' బ్రేక్ ఈవెన్ కష్టమేనా?
Updated : Apr 9, 2023
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో 'రావణాసుర'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే సినిమా మాత్రం విడుదల రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా రెండో రోజు నుంచి డ్రాప్ అవ్వడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే అనిపిస్తోంది.
రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన రావణాసుర.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.4.95 కోట్ల షేర్ రాబట్టగా, రెండో రోజు రూ.2.85 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో రూ.7.80 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. మూడో రోజైన ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.2.5 నుంచి 3 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. ఇంకా 12 కోట్లకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అయితే వీక్ డేస్ కావడంతో సోమవారం నుంచి కలెక్షన్స్ ఇంకా బాగా డ్రాప్ అవుతాయి. పైగా 'దసరా' రెండో వారంలో కూడా బాగానే ఆడుతుంది. ముఖ్యంగా నైజాంలో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. దానికి తోడు ఈ వారం 'శాకుంతలం', 'విడుదల-1' వంటి సినిమాలు రానున్నాయి. మరి ఈ ప్రతికూలతల నడుమ రావణాసుర బ్రేక్ ఈవెన్ సాధిస్తే అద్భుతమే అని చెప్పాలి.