English | Telugu
తారక్-బన్నీ బాండింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా!
Updated : Apr 9, 2023
తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ హీరోల అభిమానులు గొడవలు పడుతుంటారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో కొందరు అభిమానులు హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. ఇతర హీరోలను, వారి అభిమానులను శత్రువుల్లా చూస్తూ దుర్భాషలాడుతుంటారు. మేమంతా బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలని హీరోలు పదే పదే చెప్పినా కొందరు అభిమానుల తీరులో మార్పు రావడం లేదు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా జరిగిన సంఘటన ఒకటి అభిమానుల కళ్ళు తెరిపించేలా ఉంది.
టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు ఒకరితో ఒకరు మంచి అనుబంధం కలిగి ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరినొకరు బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. బన్నీ పలు వేదికలపై తారక్ బావ అంటూ తన బాండింగ్ ని పంచుకున్నాడు. ఇక నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా తారక్-బన్నీ మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంది. "హ్యాపీ బర్త్ డే బావ" అని తారక్ ట్వీట్ చేయగా.. "థాంక్యూ బావ.. వార్మ్ హగ్స్'' అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. ''ఓన్లీ హగ్స్?.. పార్టీ లేదా పుష్ప'' అంటూ పుష్ప మూవీ డైలాగ్ తో తారక్ అదిరిపోయే రిప్లై ఇవ్వగా.. ''వస్తున్నా'' అంటూ 'ఎన్టీఆర్ 30'లోని డైలాగ్ తో అదే రేంజ్ లో రిప్లై ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం వీరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి బాండింగ్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.