English | Telugu

రామ్‌చరణ్‌ సినిమాలో నటించాలని వుందా.. ఇంకెందుకు ఆలస్యం?

రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతోంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. చరణ్‌ తన 16వ సినిమాను స్టార్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్‌ చేయనున్నాడు. ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన బుచ్చిబాబు తన రెండో సినిమాతోనే స్టార్‌ హీరోని డైరెక్ట్‌ చేసే అవకావం వచ్చింది. ఈ చిత్రానికి కూడా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోస్తా బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకి ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారని ఆమధ్య దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇవ్వబోతోంది చిత్ర యూనిట్‌. కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ఆడిషన్స్‌ కోసం ఆహ్వానం పలుకుతూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ. అన్ని వయసుల వారికి అవకాశం ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్ర గ్రామీణ భాష బాగా తెలిసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. నటీనటులు తాము నటించిన ఒక నిమిషం వీడియో, మూడు ఫోటోలు మెయిల్‌కి కానీ, వాట్సప్‌ నంబర్‌కు కానీ పంపాలంటూ సంస్థ పేర్కొంది. రామ్‌చరణ్‌ సినిమాలో నటించాలన్న ఆసక్తి ఉన్నవారు, ఉత్తరాంధ్ర భాష బాగా తెలిసిన వారుంటే.. ఆలస్యం చేయకుండా మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ పేర్కొన్న మెయిల్‌కు, వాట్సాప్‌కు వీడియో, ఫోటోలు పంపించవచ్చు. ఆడిషన్స్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. 2025 సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌.