English | Telugu
భారీ బడ్జెట్‌తో మూడు భాగాలుగా పెద్ద స్టార్స్‌తో ‘రామాయణం’!
Updated : Oct 7, 2023
సీతారాముల చరితం ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. భారతదేశంలో సినిమా మొదలైన నాటి నుంచి నిన్నటి ఆదిపురుష్ వరకు రామాయణ గాధని వివిధ కోణాల్లో మనం చూస్తూనే ఉన్నాం. రామాయాణాన్ని ఒక్కో దర్శకుడు ఒక్కోరకంగా చూపించారు. ఆమధ్య టీవీలో కూడా ధారావాహికగా ఈ ఇతిహాసాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు అదే రామాయణాన్ని మూడు భాగాలుగా భారీ బడ్జెట్‌తో నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన హై బడ్జెట్‌లో రామాయణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మొత్తానికి మళ్ళీ ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పూనుకున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సీతగా సాయిపల్లవి, రావణాసురుడుగా కెజిఎఫ్ ఫేమ్ యష్ నటిస్తారని తెలుస్తోంది. ఆమధ్య బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నయనతార అందర్నీ మెప్పించింది. అయితే ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్‌లో కృతిసనన్‌కు సీతగా గుర్తింపు రాలేదు.
మూడు భాగాలుగా తెరకెక్కనున్న రామాయణం మొదటి భాగంలో సీతారాముల కల్యాణం, దానికి ముందు జరిగే సంఘటనల నేపథ్యం ఉంటుంది. రెండో భాగంలో రావణాసురుడు.. సీతని లంకకు తీసుకెళ్లడం, రామ, రావణాసుర యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. ఇక మూడో భాగంలో లవకుశల జననానికి సంబంధించి అంశం ఉంటుంది. మొత్తానికి మూడు భాగాల్లో రామాయణం మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.