English | Telugu
అది రజినీకాంత్, అమితాబ్ చేస్తే ఒప్పుకోరు.. బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు!
Updated : Apr 29, 2023
"బాలయ్య చాలా కోపిష్టుడు. మనసు పాల లాంటిది" అని అన్నారు సూపర్‌స్టార్ రజినీకాంథ్. శకపురుషుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవం శుక్రవారం విజయవాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, హీరో బాలకృష్ణ, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్, తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తదితరులు పాల్గొన్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రజినీకాంత్ హాజరయ్యారు. బాలయ్య వ్యక్తిత్వం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
"నా మిత్రుడు చూపుతోనే చంపేస్తాడు. ఒక తన్ను తంతే జీపు 20 నుంచి 30 అడుగుల దూరం వెళ్లి పడుతుంది. అది రజినీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు.. ఎవరు చేసినా జనం ఒప్పుకోరు. బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యను తెలుగు జనం బాలయ్యగా చూడరు. ఆ ఎన్టీ రామారావు గారినే బాలయ్యలో చూసుకుంటారు. యుగపురుషుడు ఎన్టీఆర్ ఏమైనా చెయ్యగలడు కదా! ఆయన చేస్తారు." అని చెప్పారు రజినీ.
"(బాలయ్య) చాలా కోపిష్టుడు. మనసు పాల లాంటింది. ఆయన రాజకీయాల్లో, సినిమాల్లో చాలా కాలం ఉండి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని ఆయన అన్నారు.