English | Telugu

సీత రూపంలో కృతి.. పోస్టర్ వచ్చింది!

శ్రీరాముని ఇల్లాలు సీతను మహాసాధ్విగా పేర్కొంటూ ఉంటారు. ఆమె పడిననన్ని కష్టాలు ఏ స్త్రీమూర్తీ పడి ఉండదు. ఎన్ని కష్టాలెదురైనా వాటిని నిబ్బరంతో ఎదుర్కొన్న ధీమంతురాలు సీత. రామాయణ గాథను 'ఆదిపురుష్' పేరుతో తెరకెక్కించాడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. రామునిగా ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో సీత పాత్రను కృతి సనన్ పోషించారు. అంకిత భావం, నిస్వార్థత, శౌర్యం, స్వచ్ఛతకు ప్రతిరూపమైన సీత రూపంలో ఉన్న కృతి పోస్టర్‌ను నేడు సీతానవమి సందర్భంగా రిలీజ్ చేశారు నిర్మాతలు. దాంతో పాటు 'రామ్‌ సియా రామ్‌' ఆడియో టీజర్‌ ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో కృతి ముగ్ధమనోహర రూపంతో కనిపిస్తున్నారు.

"రామ్‌ సియా రామ్" ట్యూన్ జానకికి రామునిపై ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేసేలా ఉంది. ఈ పాట ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ గీతాన్ని సచేత్-పరంపర జంట స్వరపరిచారు.

'ఆదిపురుష్‌'ను టి-సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వువి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. వచ్చే జూన్ 16న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.