English | Telugu

ర‌జ‌నీ చేసింది క‌మ‌ల్‌కి న‌చ్చ‌లేదు

ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ ఇద్ద‌రూ మంచి మిత్రులు. ఇద్ద‌రూ బాల‌చంద‌ర్ శిష్య‌రికంలో పెరిగి పెద్ద‌యిన‌వాళ్లే.. స్టార్లుగా అవ‌త‌రించిన‌వాళ్లే. క‌మ‌ల్ గురించి ర‌జ‌నీ.. ర‌జ‌నీ గురించి క‌మ‌ల్ గొప్ప‌గా చెప్పుకొంటుంటారు. ఒక‌రి క‌ష్టాల్ని మ‌రొక‌రు పంచుకొంటుంటారు. అయితే ఈమ‌ధ్య ర‌జ‌నీకాంత్ చేసిన ప‌ని బొత్తిగా నచ్చలేదు. 'ర‌జ‌నీ చేసింది మంచి ప‌నే... కానీ అది ఆమోద‌యోగ్యం కాదు' అని డైరెక్టుగానే చెప్పేశాడు క‌మ‌ల్‌. ఇంత‌కీ అదేంటంటే..

లింగ సినిమా కొన్ని అప్పుల పాలైన పంపిణీదారులు రోడ్డెక్కారు. మాకు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందే అంటూ ఆందోళ‌న చేశారు. రెండు నెల‌ల పాటు సుదీర్ఘ‌మైన పోరాటం అనంత‌రం వాళ్ల స‌మ‌స్య‌ల్ని తీర్చ‌డానికి ర‌జ‌నీనే ముందుకొచ్చాడు. తన పారితోషికంలో రూ.10 కోట్లు వెన‌క్కి ఇచ్చేశాడు. దీనిపై క‌మ‌ల్ స్పందించాడు. ''ప్ర‌తి సినిమాకీ లాభ‌న‌ష్టాలు ఉంటాయి. ఏదో ఒక‌టి డిసైడ్ అయిన త‌ర‌వాతే పెట్టుబ‌డి పెడ‌తారు. న‌ష్టాలొస్తే రోడ్డెక్క‌మేంటి? వాళ్ల క‌ష్టాలు చూసి ర‌జ‌నీ కొంత డ‌బ్బు వాప‌స్ ఇచ్చాడు. అయితే ఇదంత ఆమోద‌యోగ్యంగా లేదు. ఇది ఇక్క‌డితో ఆగ‌దు. ఇక నుంచి ప్ర‌తి సినిమాకీ ఇదొక ఫార్మాలిటీ అయిపోతుందేమో..'' అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు క‌మ‌ల్‌. నిజ‌మే.. ఇందులోనూ ఓ పాయింట్ ఉంది. క‌మ‌ల్ సినిమాలు కూడా కొన్ని డిజాస్ట‌ర్ అయ్యాయి. పంపిణీదారుల పైస‌ల్ని ఊడ్చేసిన సినిమాలున్నాయి. అలాంటి ప‌రిస్థితుల్లో క‌మ‌ల్ స్పందించాల్సిన అవ‌స‌రం రాలేదు. భ‌విష్య‌త్తులో త‌న‌కీ ఇలాంటి ఇబ్బంది ఎదుర‌వుతుందేమో అన్న భ‌యం క‌మ‌ల్‌లోనూ ఇప్పుడు క‌నిపిస్తోంది.