English | Telugu
మరోసారి రామ్ తో పూరి!
Updated : Apr 21, 2023
ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఈ జనరేషన్ లో వేగంగా సినిమాలు చేసే స్టార్ డైరెక్టర్ గా ఆయనకు పేరుంది. హీరోయిజంను సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 'లైగర్' ఘోర పరాజయం తర్వాత ఆయన స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి. ఆ సినిమా విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇంతవరకు పూరి తదుపరి సినిమాపై క్లారిటీ లేదు. 'లైగర్' విడుదల కాకుముందే విజయ్ దేవరకొండతో ప్రకటించిన 'జనగణమన' అటకెక్కింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో అసలు పూరి నెక్స్ట్ మూవీ ఏంటి? తన తనయుడు ఆకాష్ పూరితోనే ఆయన కొత్త సినిమా ఉంటుందా? అనే కామెంట్స్ వినిపించాయి. అయితే పూరి మాత్రం రామ్ పోతినేనితో తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
'లైగర్'కి ముందు రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్'(2019) అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పూరి. అప్పటిదాకా ఏడాదికి కనీసం ఒకట్రెండు సినిమాలు చేసిన పూరి.. లైగర్ కి మాత్రం ఎక్కువ టైం తీసుకున్నాడు. 2020, 2021 లలో ఆయన డైరక్ట్ చేసిన సినిమానే రాలేదు. 'లైగర్' పాన్ ఇండియా సినిమా కావడంతో ఎప్పుడు లేనిది పూరి స్క్రిప్ట్ కి, మేకింగ్ ఎక్కువ టైం తీసుకోవడం.. దానికి తోడు లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా 2022 లో విడుదలైంది. పూరి ఎక్కువ సమయం తీసుకొని చేసి, ఎంతో నమ్మకం పెట్టుకున్న 'లైగర్' డిజాస్టర్ అయింది. దీంతో కొద్ది నెలలు గ్యాప్ తీసుకున్న పూరి.. రామ్ తో మరో సినిమా చేసి 'ఇస్మార్ట్ శంకర్' లాంటి హిట్ తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. రామ్ సైతం పూరితో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్.. ఆ తర్వాత పూరి ప్రాజెక్ట్ తో బిజీ అయ్యే అవకాశముందని అంటున్నారు.