English | Telugu
'ప్రాజెక్ట్ k' కూడా రెండు భాగాలుగా!
Updated : Jul 10, 2023
'బాహుబలి' తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే. అయితే ఇప్పుడు దానికి మరో అంశం తోడైంది. అదేంటంటే ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఎక్కువగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. 'బాహుబలి' రెండు భాగాలుగా అలరించింది. 'సలార్' కూడా రెండు భాగాలుగా రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ లిస్టులో 'ప్రాజెక్ట్ k' కూడా చేరనుంది అంటున్నారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచస్థాయిలో సంచలనాలు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని, 'సలార్' తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా విడుదలవుతుందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని బలంగా న్యూస్ వినిపిస్తోంది.