English | Telugu
అక్కడ 60 రోజుల్లో సినిమా పూర్తవుతుంది. ఇక్కడ ఆ వ్యవస్థ లేదు!
Updated : Dec 9, 2023
టాలీవుడ్‌లో పలు భారీ చిత్రాలు, చిన్న చిత్రాలు నిర్మించి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్. నిర్మాతగానే కాదు, సినీ పరిశ్రమకు చెందిన అనే సంఘాలకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు కల్యాణ్. సినీ పరిశ్రమలోని సమస్యలపై అనేక సందర్భాల్లో స్పందిస్తూ.. తగిన పరిష్కారాన్ని కూడా సూచించే సి.కల్యాణ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘ఒకప్పుడు సినిమా అవార్డుల ప్రదానోత్సవం ఎంతో వైభవంగా జరిగేది. దాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. అవార్డులు వచ్చినవారు, రాని వారు కూడా ఫంక్షన్‌కు హాజరయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరికైతే అవార్డులు వచ్చాయో వారు మాత్రమే ఫంక్షన్‌కు హాజరవుతున్నారు. ఇలాంటి వాతావరణంలో అవార్డుల ఫంక్షన్స్ ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక సినిమా నిర్మాణం విషయానికి వస్తే నిర్మాతలకు దేని మీదా నియంత్రణ లేదు. కొంతకాలం సినిమాల నిర్మాణం ఆపడం వల్ల డబ్బు ఎక్కడ వృధా అవుతుంది అనే విషయాన్ని గమనించారు. అలా చూస్తూ కూర్చుంటే సినిమాలు నిర్మించే పరిస్థితి ఉండదని గ్రహించి మళ్ళీ సినిమాల నిర్మాణం వైపు వస్తున్నారు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద సినిమా అయినా 60 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ, ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదు. నేను కూడా త్వరలోనే సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాను. బాలకృష్ణగారితో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం ఆయన వరసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత మా బేనర్‌లో సినిమా ఉంటుంది. అయితే ఆ సినిమా స్టార్ట్ అయ్యేలోపు కొన్ని సినిమాలు కూడా చెయ్యొచ్చు. కానీ, ఇప్పుడు నా దృష్టంతా చెన్నయ్‌లో నిర్మాణంలో ఉన్న అమ్యూజ్‌మెంట్ పార్క్ పైనే ఉంది. దానికి తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా దాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. అలాగేఇండియాలోనే తొలిసారి స్కై థియేటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించినంత సహకారం మరే ప్రభుత్వం అందించలేదు. నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సినీ పరిశ్రమ తరఫున త్వరలోనే కలవబోతున్నాం. సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలను చర్చించాలనుకుంటున్నాం. హైదరాబాద్‌లో అంతరజ్జాతీయ చలన చిత్రోత్సవాలు జరగడం లేదు. ఈ విషయంలో సహకరించాలని ఆయన్ని కోరతాం. అలాగే ఎపి సి.ఎం. జగన్‌మోహన్‌రెడ్డిగారు కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్నివిధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అన్నారు.