English | Telugu
సీక్వెల్ ప్రకటన వచ్చింది.. పోస్టర్ తోనే అంచనాలు పెంచేశారు
Updated : Jul 24, 2023
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. ఇప్పటిదాకా అతను 18 సినిమాలు చేయగా, కథల ఎంపికలో తొలి సినిమా 'బాణం' నుంచే వైవిధ్యం చూపిస్తున్నాడు. ముఖ్యంగా అతని కెరీర్ లో కొన్ని సినిమాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందులో 'ప్రతినిధి' ఒకటి. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించాడు రోహిత్.
'ప్రతినిధి-2'ని అధికారికంగా ప్రకటిస్తూ ఈరోజు(జూలై 24న) పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో న్యూస్ పేపర్లతో రోహిత్ రూపాన్ని రూపొందించిన తీరు ఆకట్టుకుంది. 'ప్రతినిధి'కి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించగా, 'ప్రతినిధి-2'కి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వానర ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని 2024, జనవరి 25 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.