English | Telugu
ఊహించని షాకిచ్చిన 'హనుమాన్' డైరెక్టర్!
Updated : Jan 14, 2024
ప్రస్తుతం తెలుగునాట 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు బాగా వినిపిస్తోంది. తక్కువ బడ్జెట్ లో సూపర్ హీరో ఫిల్మ్ ని అద్భుతంగా తెరకెక్కించాడని ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా 'హనుమాన్' వచ్చింది. దీని తర్వాత 'జై హనుమాన్', 'అధీర'తో పాటు పలు సూపర్ హీరో ఫిల్మ్ లు రానున్నాయి. అయితే వీటి కంటే ముందు మరో సినిమాతో పలకరించబోతున్నట్లు చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. "ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి 20 స్క్రిప్ట్ లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు చేస్తాం. ఈ యూనివర్స్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది. ప్రస్తుతం మూడు చిత్రాలను సిద్ధం చేస్తున్నాం. అసలు ఈ యూనివర్స్ తో సంబంధం లేకుండా ఒక సినిమా చేస్తున్నా. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయింది. మరో నెల రోజుల్లో ఆ సినిమాని పూర్తి చేసి, ఆ వివరాలు చెబుతాను" అని తెలిపాడు. మొత్తానికి ప్రశాంత్ వర్మ నుంచి త్వరలో మరో సినిమా రాబోతుంది.