English | Telugu

షాకింగ్‌.. ఆ సత్తా తనకు లేదంటున్న ప్రశాంత్‌ నీల్‌!!

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రమోషన్ల వరకు వచ్చేసరికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ సినిమాని ఎత్తేసే పనిలోనే ఉంటారు. సినిమా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫ్లాప్‌ అవుతుందని అందరికీ తెలిసినా.. సినిమాకి ఓపెనింగ్స్‌ భారీగా ఉండాలన్న ఉద్దేశంతో సినిమా గురించి చెప్పిందే చెప్పి ఊదరగొట్టేస్తుంటారు. ఇక హీరో, డైరెక్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో డెడికేటెడ్‌ అని డైరెక్టర్‌ అంటే.. డైరెక్టర్‌ వెరీ టాలెంటెడ్‌ అని హీరో అంటాడు. ఇలాంటి మాటలు విని విని అందరి చెవులు దిమ్మెక్కిపోయాయి. ఇవన్నీ ఎందుకంటే.. ‘సలార్‌’ డైరెక్టర్‌ చెప్పిన కొన్ని వాస్తవాల గురించి చెప్పేందుకే.

ఏ సినిమా డైరెక్టర్‌కైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం సాధ్యమయ్యే పనికాదు. అందులోనూ మీడియా ముందు పాజిటివ్‌ విషయాలు తప్ప నెగెటివ్‌ అంశాల ప్రస్తావనే తీసుకురారు. ఎందుకంటే కోట్ల బడ్జెట్‌తో చేసిన సినిమా అంటే యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఆ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడాలి. అది రూలు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎలాగూ ప్రేక్షకులు తీర్పు చెబుతారు. అప్పటివరకు తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం తప్ప వారికి మరో మార్గం లేదు. మరో మూడు రోజుల్లో రిలీజ్‌ అవుతున్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ల ‘సలార్‌’ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల విడులైన రిలీజ్‌ ట్రైలర్‌తో సినిమా రేంజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. కెజిఎఫ్‌లో తాను చేసిన పొరపాట్లు సలార్‌లోనూ చెయ్యాల్సి వచ్చిందన్నారు. పని ఒత్తిడి, కొన్ని పరిస్థితుల కారణంగానే ఆ పొరపాట్లు జరిగాయే తప్ప మరో కారణం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో తాను చేసిన తప్పులు ఏమిటనేది మాత్రం వెల్లడిరచలేదు.

సలార్‌ సినిమా ద్వారా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా.. అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఇండస్ట్రీకి వచ్చింది సందేశాలు ఇవ్వడానికి, సొసైటీలో మార్పులు తేవడం కోసం కాదు అన్నారు. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా తాను సినిమాలు తీస్తానని ఈ సందర్శంగా తెలియజేశారు.

సలార్‌ చిత్రానికి కెజిఎఫ్‌తో లింక్‌ వుందంటూ వస్తున్న వార్తలకు ప్రశాంత్‌ నీల్‌ చెక్‌ పెట్టారు. సలార్‌ సినిమా ఏ రూపంలోనూ కెజిఎఫ్‌కి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు సినిమాటిక్‌ యూనివర్స్‌ను హ్యాండిల్‌ చేసేంత సత్తా తనకు లేదని సమాధానం చెప్పి షాక్‌ ఇచ్చాడు. కెజిఎఫ్‌ వంటి గొప్ప సిరీస్‌ను డైరెక్ట్‌ చేసిన దర్శకుడు అలాంటి సమాధానం చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.